చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌కు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు: ఇక, సత్సంబంధాలే
హైదరాబాద్/అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ మేరకు కూటమి అభ్యర్థులు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు సీఎం రేవంత్ శుభాకాంక్షలు తెలిపారు.
ఏపీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించినందుకు అభినందనలు చెప్పారు సీఎం రేవంత్. చంద్రబాబు నాయకత్వంలో ఏపీ ప్రగతిపథంలో పయనించాలని రేవంత్ ఆకాంక్షించారు. ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగిద్దామని, సమస్యలు పరిష్కరించుకుంటూ అభివృద్ధి పథం వైపు సాగుదామని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించిన విషయం తెలిసింది. 175 అసెంబ్లీ స్థానాలున్న ఏపీలో.. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి ఏకంగా 160కిపైగా సీట్లను దక్కించుకుంది. అంతేగాక, లోక్‌సభ ఎన్నికల్లోనూ సత్తా చాటింది. ఎన్డీయే కూటమి అభ్యర్థులు 20కిపైగా స్థానాల్లో విజయం సాధించారు. ఇక, ఏపీలో గత ఐదేళ్లుగా అధికారంలో ఉన్న వైసీపీకి కేవలం 11 అసెంబ్లీ స్థానాల్లోనే గెలుపొందడం గమనార్హం. ఇక, ఎంపీ స్థానాలు కూడా 4కే పరిమితమైంది.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో…
— Revanth Reddy (@revanth_anumula) June 4, 2024
విజయం సాధించిన
టీడీపీ అధినేత
చంద్రబాబు నాయుడు గారికి,
జనసేన అధినేత
పవన్ కల్యాణ్ గారికి
నా అభినందనలు.
ఇరు రాష్ట్రాల మధ్య
సత్సంబంధాలను కొనసాగిస్తూ…
సమస్యలను పరిష్కరించుకుంటూ…
అభివృద్ధి పథం వైపు సాగుదాం.@ncbn @PawanKalyan
ఈ నేపథ్యంలో ఏపీలో కూటమి ప్రభుత్వం త్వరలోనే ఏర్పడనుంది. మరోవైపు, దేశ రాజకీయాల్లో మరోసారి చంద్రబాబు నాయుడు కీలక పాత్రను పోషించే అవకాశం వచ్చింది. ఇప్పటికే ఎన్డీఏ కన్వీనర్ గా ఉండాలని బీజేపీ పెద్దలు కోరినట్లు సమాచారం. దేశంలో ఎన్డీఏ కూటమికి 292 సీట్లు రావడంతో టీడీపీ, జేడీయూ లాంటి పార్టీలు కీలకంగా మారాయి. కేంద్రంలో ఏర్పడబోయే ప్రభుత్వంలోనూ ఈ రెండు పార్టీలకు ప్రాధాన్యత లభించే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications