వాళ్లకు టీటీడీ ఉంటే.. మనకు వైటీడీ! ప్రతీసారి అడుక్కోవాలా?
తిరుమల శ్రీవారి దర్శనం కోసం తెలంగాణ ప్రజాప్రతినిధులు జారీ చేసే సిఫార్సు లేఖలకు ప్రాధాన్యత లభించకపోవడం గత కొంత కాలంగా వివాదంగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో 'కొలువుల పండగ' కార్యక్రమానికి హాజరైన సీఎం రేవంత్ రెడ్డి.. పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్ పోస్టులకు ఎంపికైన 922 మంది అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తిరుమల దేవస్థానం దర్శనం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమల దేవస్థానం దర్శనం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, టీడీపీ అధికారులను తెలంగాణ ప్రజాప్రతినిధులు ప్రతీసారి అడుక్కోవడం ఏంటని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి.

వాళ్ల(ఏపీకి)కు టీటీడీ ఉంటే మనకు వైటీడీ(యాదగిరిగుట్ట దేవస్థానం) లేదా? ప్రతీసారీ బతిమాలుకోవడం ఎందుకు? భద్రాచలంలో రాముడు లేడా? మనకు శివుడి ఆలయాలు ఏమైనా తక్కువ ఉన్నాయా? అంటూ రేవంత్ ప్రశ్నించారు. టీటీడీ వెళ్లి బతిమాలుకునే బదులు తెలంగాణలో ఉన్న ఈ ఆలయాలకు వెళ్లొచ్చిన రేవంత్ రెడ్డి సూచించారు.
ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ ప్రజాప్రతినిధులకు తిరుమలలో సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని చాలా కాలంగా తెలంగాణ నేతలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణకు చెందిన ఎంపీ, ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలు ఇచ్చినప్పటికీ టీటీడీ అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలున్నాయి. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వంతో మాట్లాడాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డికి నేతల నుంచి విజ్ఞప్తులు అందాయి. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది.












Click it and Unblock the Notifications