వక్ఫ్ బిల్లుపై సుప్రీంకోర్టులో సవాల్ చేసిన కాంగ్రెస్, ఎంఐఎం
పార్లమెంట్ ఉభయ సభల్లో వక్ఫ్ సవరణ బిల్లు 2025 ఆమోదం పొందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు ఇప్పుడు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. వక్ఫ్ సవరణ బిల్లు 2025పై కాంగ్రెస్, ఎంఐఎం సుప్రీంకోర్టులో సవాల్ చేశాయి.
కాంగ్రెస్ ఎంపీ మహ్మద్ జావేద్, ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ బిల్లు రాజ్యాంగ చెల్లుబాటు అంశాన్ని సుప్రీంకోర్టులో అసదుద్దీన్ ఒవైసీ సవాల్ చేశారు. ఈ బిల్లులో నిబంధనలు ముస్లిం సమాజ ప్రాథమిక హక్కులను ఉల్లంఘించేలా ఉన్నాయని పేర్కొన్నారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సవరణ బిల్లు వక్ఫ్ ఆస్తులు, వాటి నిర్వహణపై ఏకపక్షంగా ఉందని, ముస్లిం సమాజానికి చెందిన మతపరమైన స్వయం ప్రతిపత్తిని దెబ్బతీస్తుందని కాంగ్రెస్ ఎంపీ జావేద్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. కాగా, పార్లమెంటులో ఆమోదం పొందిన వక్ఫ్ సవరణ బిల్లుపై రాష్ట్రపతి సంతకం చేస్తే అది చట్టం కానుంది.
మరోవైపు, వక్ఫ్ సవరణ బిల్లుకు ఆమోదం లభించిన నేపథ్యంలో దేశంలోని పలు నగరాల్లో ముస్లింలు నిరసనలు చేపట్టారు. కోల్‌కతా, చెన్నై, అహ్మదాబాద్‌లలో శుక్రవారం ప్రార్థనల అనంతరం పెద్ద సంఖ్యలో వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేపట్టారు. తమిళనాడులో సినీనటుడు, తమిళగ వెట్రి కజగం పార్టీ అధ్యక్షుడు విజయ్ రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చారు. దీంతో చెన్నై, కోయంబత్తూరు వంటి నగరాల్లో టీవీకే కార్యకర్తలు ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు.
నిరసనలు, ఆందోళనలు జరిగే అవకాశం ఉండటంతో శాంతిభద్రతలకు భంగం వాటిల్లకుండా చూసేందుకు ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. పారామిలిటరీ బలగాలతో కలిసి శుక్రవారం జామియానగర్, జామియా మిలియా ఇస్లామియాతోపాటు నగరంలోని పలు సున్నితమైన ప్రాంతాల్లో కవాతు నిర్వహించారు. పలు చోట్ల పరిస్థితిని సమీక్షించేందుకు డ్రోన్లను కూడా రంగంలోకి దించారు. దేశంలోని ఇతర నగరాల్లోని శాంతిభద్రతలపై పోలీసు యంత్రాంగం దృష్టి సారించింది.












Click it and Unblock the Notifications