గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్
ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికకు కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించింది. అల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత వావిలాల నరేందర్ రెడ్డిని అభ్యర్థిగా ఖరారు చేసింది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ శుక్రవారం ప్రకటించారు.
ప్రస్తుతం ఈ స్థానం నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి ఎమ్మెల్సీగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేసేందుకు ఆసక్తి చూపకపోవడంతో నరేందర్ రెడ్డికి లైన్ క్లియర్ అయ్యింది. కాంగ్రెస్ టికెట్ తనకే దక్కుతుందనే ధీమాతో ఉన్న నరేందర్ రెడ్డి.. అధికారిక ప్రకటన రాకముందు నుంచే ప్రచారం ప్రారంభించడం గమనార్హం. ఇప్పుడు అధికారిక ప్రకటన రావడంతో ప్రచారాన్ని మరింత ఉధృతం చేయనున్నారు.

కాగా, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి బీజేపీ తమ పార్టీ అభ్యర్థిగా సీ అంజిరెడ్డి పేరును ప్రకటించింది. అయితే, ప్రతిపక్ష పార్టీ, ఉత్తర తెలంగాణలో మంచి పట్టున్న బీఆర్ఎస్ మాత్రం ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపకపోవడం చర్చనీయాంశంగా మారింది.
బీజేపీ, కాంగ్రెస్ తమ అభ్యర్థులను ప్రకటించి ప్రచారం మొదలు పెట్టగా.. బీఆర్ఎస్ మాత్రం ఇప్పటి వరకు తమ పార్టీ తరపున ఎమ్మెల్సీ అభ్యర్థిని ప్రకటించలేదు. దీంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేయకపోవచ్చే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీంతో కాంగ్రెస్, బీజేపీల మధ్యే పోటీ నెలకొంది. కాగా, రాష్ట్రంలోని 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఇప్పటికే షెడ్యూల్ వచ్చింది. ఒక గ్రాడ్యుయేట్, రెండు టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఈ మూడు స్థానాలకు ఫిబ్రవరి 27న ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఈ ప్రకటించింది.












Click it and Unblock the Notifications