ఇద్దరు రాజ్యసభ అభ్యర్దుల ఖరారు - కాంగ్రెస్ అనూహ్య ఎంపిక..!!
తెలంగాణలో కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులు ఖరారయ్యారు. తెలంగాణ నుంచి మూడు స్థానాలకు ఎన్నికల కోసం ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ సమయంలో ఇతర రాష్ట్రాలతో పాటుగా తెలంగాణ నుంచి రెండు స్థానాలకు అభ్యర్దులను ప్రకటించారు. అసెంబ్లీలో సంఖ్య బలం ఆధారంగా మూడో స్థానం బీఆర్ఎస్ కు దక్కనంది. దీంతో, ఓటింగ్ కు అవకాశం లేకుండా రెండు పార్టీల నుంచి ముగ్గురు అభ్యర్దులు ఏకగ్రీవంగా ఎన్నిక కావటం లాంఛనంగా మారుతోంది.
అభ్యర్దుల ప్రకటన : తెలంగాణలో కాంగ్రెస్ అధినాయకత్వం రాజ్యసభ అభ్యర్దులను ప్రకటించింది. మూడు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అసెంబ్లీలో సంఖ్యా బలం ఆధారంగా కాంగ్రెస్ కు రెండు, బీఆర్ఎస్ కు ఒక స్థానం దక్కాల్సి ఉంది. అయితే, కాంగ్రెస్ మూడు స్థానాలకు పోటీ చేస్తుందనే ప్రచారం సాగింది. హైకమాండ్ పార్లమెంట్ ఎన్నికల వేళ ఎలాంటి ప్రయోగాలు చేయవద్దని పార్టీ రాష్ట్ర నాయకత్వానికి స్పష్టం చేసింది. అందులో భాగంగా ఇద్దరు అభ్యర్దులను ప్రకటించింది. ఓసీ వర్గానికి చెందిన కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి, బీసీ వర్గానికి చెందిన ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కుమారుడు సికింద్రాబాద్ పార్టీ అధ్యక్షుడు గా ఉన్న ఎం అనిల్ కుమార్ యాదవ్ పేర్లను పార్టీ ఖరారు చేసింది.

అనూహ్య ఎంపిక : రేణుకా చౌదరి త్వరలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో ఖమ్మం లేదా మల్కాజ్ గిరి నుంచి సీటు ఆశిస్తున్నారు. అనిల్ కుమార్ యాదవ్ సికింద్రాబాద్ సీటు కోరుతున్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్దుల ఎంపికను పరిగణలోకి తీసుకొనే రాజ్యసభ అభ్యర్దులను ఖరారు చేసినట్లు స్పష్టం అవుతోంది. ఒక సీటు మహిళకు ఇవ్వటంతో పాటుగా మరో సీటు యువతకు కేటాయించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ పార్టీ అనుబంధ విభాగం నేత వెంకట్ ను మండలికి ఎంపిక చేసారు. దీని ద్వారా బీసీలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్పష్టం అవుతోంది. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవలేదు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీసీ వర్గాలతో పాటుగా గ్రేటర్ పరిధిలో పార్టీకి కలిసి వచ్చే నిర్ణయాలకు పార్టీ ప్రాధాన్యత ఇస్తోంది. అందులో భాగంగానే ఈ ఎంపిక జరిగినట్లు స్పష్టం అవుతోంది.

ఏకగ్రీవంగా ఎన్నిక : కాంగ్రెస్ నుంచి పలువురు సీనియర్లు రాజ్యసభ స్థానాలు ఆశించారు. వీహెచ్, జానారెడ్డి, చిన్నారెడ్డి లాంటి నేతలు చివరి నిమిషం వరకు ప్రయత్నాలు చేసారు. తొలుత జాతీయ స్థాయి నేతకు ఒక సీటు కేటాయించి.. మరో సీటు రాష్ట్ర నేతలకు ఇవ్వాలని భావించారు. అయితే, అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుతో త్వరలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లోనూ తెలంగాణలో మెజార్టీ సీట్లు సాధించాలంటే స్థానిక నేతలకే సీట్లు ఇవ్వాలని రాష్ట్ర నాయకత్వం కోరింది. ఈ మేరకు రెండు స్థానాలు రాష్ట్ర నేతలకే కేటాయిస్తూ పార్టీ అధినాయకత్ం నిర్ణయం తీసుకుంది. గురువారం ఈ ఇద్దరు రాజ్యసభకు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. బీఆర్ఎస్ నుంచి అభ్యర్దిని ఈ రోజే ప్రకటించే అవకాశం ఉంది. దీంతో మూడు స్థానాలు ఏకగ్రీవం కావటం లాంఛనం కానుంది.












Click it and Unblock the Notifications