కాంగ్రెస్ సర్కారును టచ్ చేస్తే..: బీజేపీ, బీఆర్ఎస్‌లకు సీఎం రేవంత్ హెచ్చరిక
వరంగల్: ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగురుతుందని, రాహుల్‌గాంధీ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేస్తారని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. మహబూబాబాద్‌లో నిర్వహించిన కాంగ్రెస్ జనజాతర సభలో పాల్గొన్న రేవంత్ రెడ్డి.. తన ప్రసంగంలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై విమర్శలు గుప్పించారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడం చాలా అవసరమన్నారు.
ఈ దఫా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అత్యధిక స్థానాల్లో గెలిపించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. ప్రభుత్వాన్ని పడగొట్టాలని ప్రయత్నిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. విభజన చట్టం ప్రకారం, రాష్ట్రానికి ప్రకటించిన హామీలను బీజేపీ ప్రభుత్వం నెరవేర్చలేదన్నారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఎందుకివ్వలేదని రేవంత్ ప్రశ్నించారు. కాజీపేటకు రావాల్సిన కోచ్ ఫ్యాక్టరీని ప్రధాని, ఉత్తరాదికి తరలించుకుపోయారని ఆరోపించారు.

మానుకోట కాంగ్రెస్ పార్టీకి ఎప్పటికీ కంచుకోటేనన్న రేవంత్.. ఎంపీ ఎన్నికల్లోనూ సీపీఐ, సీపీఎం, జనసమితి పార్టీల మద్దతు తీసుకున్నామన్నారు. శాసనసభ ఎన్నికల్లో కేసీఆర్‌ను ప్రజలు బండకేసి కొట్టారన్న రేవంత్.. రాష్ట్రానికి అన్యాయం చేసిన మోడీని కూడా గద్దె దించాలని కోరారు. రాష్ట్రంలో కేసీఆర్ దోపిడీకి ఢిల్లీలో మోడీ సహకరించారని ఆరోపించారు. కాళేశ్వరంలో రూ.లక్ష కోట్ల దోపిడీ జరిగినా ప్రధాని చూస్తూ కూర్చున్నారన్నారు.
కాంగ్రెస్‌ను నేరుగా ఎదుర్కొనలేక, బీఆర్ఎస్-బీజేపీ కుమ్మక్కయ్యాయని ఆరోపించారు సీఎం రేవంత్. కుమార్తె కవిత బెయిల్ కోసం మోడీతో కేసీఆర్ చేతులు కలిపారని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని మోడీ కాళ్లదగ్గర తాకట్టు పెట్టారని రేవంత్ విమర్శించారు. పంద్రాగస్టులోగా రూ.2లక్షల రైతు రుణమాఫీ చేస్తామని మరోసారి స్పష్టం చేశారు సీఎం రేవంత్. ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవటానికి అల్లాటప్పాగా రాలేదని.. పదేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు రేవంత్. లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి 14 ఎంపీ స్థానాలను సోనియా గాంధీకి కానుకగా ఇద్దామని రేవంత్ పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications