షర్మిల ఆశలు గల్లంతు, కాంగ్రెస్ మార్క్ రాజకీయం - కిం కర్తవ్యం..!!
వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల (YS Sharmila) రాజకీయంగా డైలమాలో ఉన్నట్లు స్పష్టం అవుతోంది. కాంగ్రెస్ లో తన పార్టీ విలీనంతో పాటుగా రాజకీయ భవిష్యత్ అదే పార్టీలో కొనసాగించాలని షర్మిల నిర్ణయించారు. కానీ, కాంగ్రెస్ మార్క్ రాజకీయాలతో షర్మిల ఆశలు గల్లంతు అయ్యాయి. అటు అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్(Congress) అభ్యర్దులు ఖరారు పైన కసరత్తు జరుగుతోంది. తెలంగాణలోనే తన రాజకీయ జీవితం అని ప్రకటించిన షర్మిల భవిష్యత్ కార్యాచరణ ఏంటి.
కాంగ్రెస్ మార్క్ రాజకీయం:తెలంగాణలో కాంగ్రెస్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. వైఎస్ షర్మిల ఆశలు ఫలించే అవకాశం కనిపించటం లేదు. మరి కొద్ది రోజుల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల(TS Assembly Elections) షెడ్యూల్ విడుదల కానుంది. అటు కాంగ్రెస్ అభ్యర్ధుల ఖరారు ప్రక్రియ వేగవంతం చేసింది. వైఎస్సార్టీపీ(YSRTP) అధినేత్రిగా షర్మిల తాను వచ్చే ఎన్నికల్లో ఖమ్మం జిల్లా పాలేరు నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. అక్కడ స్థానికంగా కార్యక్రమాలు నిర్వహించారు. ఇదే సమయంలో తన పార్టీ అనుకున్న స్థాయిలో ఎదగకపోవటంతో కాంగ్రెస్ తో విలీనం దిశగా కసరత్తు చేసారు. కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్దం చేసుకున్నారు. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్(DK Shiva Kumar) ద్వారా రాయభారం నడిపారు. నేరుగా సోనియా, రాహుల్ తో ఢిల్లీలో సమావేశమయ్యారు.

పార్టీలోకి ఓకే..సీటు మాత్రం:వైఎస్సార్ కుమార్తెగా షర్మిలకు సోనియా, రాహుల్ గౌరవం ఇచ్చారు. నాడు వైఎస్సార్ పేరు సీబీఐ ఎఫ్ఐఆర్ లో చోటు చేసుకున్న పరిణామాలపైన స్పష్టత ఇచ్చారు. వారు చెప్పిన అంశాలతో వైఎస్సార్ పేరు సీబీఐ ఛార్జ్ షీట్లలో చేర్చటంలో వారి ప్రమేయం లేదని షర్మిల నిర్దారణకు వచ్చారు. పార్టీలో సముచిత గుర్తింపు ఉంటుందని షర్మిలకు హామీ దక్కింది. అయితే, షర్మిల తాను తెలంగాణ రాజకీయాలకే పరిమితం అవుతానని స్పష్టం చేసారు. అక్కడే అసలు సమస్య మొదలైంది. టీపీసీసీ చీఫ్ రేవంత్(TPCC Chief Revanth) సహా మరి కొందరు తెలంగాణలో షర్మిలకు ప్రాధాన్యతపైన అభ్యంతరం వ్యక్తం చేసారు. దీంతో, ఏపీలో అవకాశం కల్పిస్తామని ప్రతిపాదించారు. కానీ, షర్మిల అంగీకరించ లేదు.

షర్మిల నెక్స్ట్ స్టెప్:పలితంగా, వైఎస్సార్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేయటంపైన షర్మిలే తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని..చర్చల్లో కీలక పాత్ర పోషించిన కేసీ వేణుగోపాల్ స్పష్టం చేసారు. ఇదే సమయంలో తాజాగా షర్మిల ఆశించిన పాలేరు(Palair) సీటును మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి(Ponguleti) ఖరారు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. అదే విధంగా ఖమ్మం సీటును మాజీ మంత్రి తుమ్మలకు కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది.
కొత్తగూడెం నుంచి సీపీఐతో పొత్తులో భాగంగా ఇవ్వనున్నారు. దీంతో, షర్మిలకు లోక్ సభ సీటు ఇస్తున్నారనే చర్చ సాగినా..దాని పైన స్పష్టత లేదు. దీంతో, తెలంగాణ రాజకీయాల్లో షర్మిల భవిష్యత్ అడుగులు ఏంటి.. ఏం చేయబోతున్నారు.. కాంగ్రెస్ తోనే రాజకీయంగా ముందుకు వెళ్తారా..నిర్ణయంలో మార్పు ఉంటుందా అనే ఆసక్తి కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications