నాగార్జునసాగర్ ఉపఎన్నిక : కాంగ్రెస్ అభ్యర్థిగా జానారెడ్డి... అధికారికంగా ఖరారు చేసిన అధిష్టానం...
నాగార్జునసాగర్ ఉపఎన్నికకు కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిని ఖరారు చేసింది. మాజీ మంత్రి జానారెడ్డిని సాగర్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దింపాలని నిర్ణయించింది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ముకుల్ వాస్నిక్ ఈ విషయాన్ని వెల్లడించారు. కాంగ్రెస్ అధిష్టానం జానారెడ్డి పేరును ఆమోదించినట్లు వాస్నిక్ తెలిపారు.
సాగర్ ఉపఎన్నిక బరిలో జానారెడ్డి ఉంటారా లేక ఆయన కుమారుడు పోటీ చేస్తారా అని మొదట్లో కొంత ప్రచారం జరిగింది. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ పుంజుకునేందుకు సాగర్ ఉపఎన్నిక అందివచ్చిన అవకాశం కావడంతో సీనియర్ నేత జానారెడ్డే బరిలో దిగాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. జానారెడ్డి రూపంలో బలమైన నేత సాగర్ బరిలో దిగడంతో ఉపఎన్నిక రసవత్తరంగా మారనుంది.

మరోవైపు టీఆర్ఎస్ పార్టీ దివంగత ఎమ్మెల్యే నోముల నరసింహయ్య కుమారుడు నోముల భగత్‌కు టికెట్ ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ భగత్‌కు టికెట్ ఇవ్వకపోతే గుత్తా సుఖేందర్ రెడ్డి,తేరా చిన్నపరెడ్డిల్లో ఒకరికి టీఆర్ఎస్ అవకాశం ఇవ్వొచ్చునన్న ప్రచారం కూడా ఉంది. త్వరలోనే దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇక బీజేపీ తరుపున నివేదితా రెడ్డి,అంజయ్య యాదవ్ టికెట్ కోసం పోటీ పడుతున్నారు. వీళ్లలో ఎవరికి టికెట్ దక్కుతుందన్నది వేచి చూడాలి.
దుబ్బాక ఉపఎన్నిక,జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పరాజయం నేపథ్యంలో సాగర్ ఉపఎన్నికపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఒకవేళ ఇక్కడ కూడా టీఆర్ఎస్ బోల్తా కొడితే రాష్ట్రంలో రాజకీయాలు వేగంగా మారే అవకాశం ఉంది. అదే టీఆర్ఎస్ గెలిస్తే... ప్రజల్లో తమకు ఆదరణ తగ్గలేదని నిరూపించుకున్నట్లవుతుంది. సాగర్ ఉపఎన్నికను ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. దుబ్బాక ఉపఎన్నిక సమయంలో అటువైపు కన్నెత్తి కూడా చూడని ఆయన... సాగర్ ఉపఎన్నికకు రెండు నెలల ముందే హాలియాలో బహిరంగ సభ పెట్టారు. నియోజకవర్గంలో పలు అభివృద్ది పనులకు హామీలిచ్చారు.పార్టీకి సంబంధించిన పలువురు కీలక నేతలకు గెలుపు బాధ్యతలను అప్పగించినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications