వైఎస్ ఫార్ములాతో రేవంత్, హైకమాండ్ ఫ్లాట్ - అదే సక్సెస్ మంత్ర..!!
రేవంత్ రెడ్డి. కాబోయే తెలంగాణ ముఖ్యమంత్రి. పార్టీలో చేరిన అనతి కాలంలోనే సీనియర్లను కాదని సీఎం పదవి దక్కించుకున్నారు. కాంగ్రెస్ లో చేరిన సమయం నుంచి రేవంత్ ప్రతీ అడుగు వ్యూహాత్మకంగా వేసారు. పార్టీ హైకమాండ్ ను మెప్పించేందుకు తొలి నుంచి ప్రయత్నించారు. ఇందుకు పూర్తిగా వైఎస్సార్ అమలు చేసిన ఫార్ములానే రేవంత్ కొనసాగించారు. "అన్నింటా" హైకమాండ్ కు అభయం ఇచ్చారు. అదే సక్సెస్ మంత్రగా మార్చుకున్నారు.
రేవంత్ వ్యూహాత్మకం : వైఎస్సార్ తరువాత ఇప్పుడు కాంగ్రెస్ కు ఆదరణ ఉన్న నేత రేవంత్ కనిపిస్తున్నారు. తెలంగాణ ఇచ్చినా రెండు రాష్ట్రాల్లోనూ నష్టపోయిన కాంగ్రెస్ పదేళ్ల తరువాత అధికారం దక్కించుకుంది. కాంగ్రెస్ లో చేరిన సమయం నుంచే ఢిల్లీ కేంద్రంగా సైలెంట్ ఆపరేషన్ అమలు చేసారు. అదే సీనియర్లు పోటీ పడ్డా..ఎందరు అడ్డు చెప్పినా టీపీసీసీ పదవి దక్కటానికి కారణం అయింది. ఆ పదవి ఇస్తే పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యత తనదేనని రేవంత్ స్పష్టం చేసారు. కాంగ్రెస్ కు మింగుడపడని కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ..హైకమాండ్ ను ఆకట్టుకున్నారు. ఉప ఎన్నికల్లో ఓడినా.. సీనియర్లు ఫిర్యాదులు చేసినా హైకమాండ్ ను ఎలా మేనేజ్ చేయాలో నాడు వైఎస్సార్ అమలు చేసిన ఫార్ములానే కొనసాగించారు. హైకమాండ్ తన మాట విశ్వసించేలా చేయటంలో సక్సెస్ అయ్యారు.

హైకమాండ్ ను మెప్పిస్తూ : 2009 ఎన్నికల సమయంలోనూ నాడు వైఎస్సార్ ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుపు బాధ్యత తనదేని పార్టీ హైకమాండ్ కు అభయం ఇచ్చారు. పొత్తుల విషయంలో ససేమిరా అన్నా వైఎస్సార్ తాను సూచించిన వాళ్లకు సీట్లు ఇవ్వాలని కోరారు. వైఎస్సార్ మాట పైన సోనియా నమ్మకం పెట్టుకున్నారు. ఆ ఎన్నికల్లో మహా కూటమి, ప్రజారాజ్యంతో తలపడిన వైఎస్సార్ కాంగ్రెస్ ను తిరిగి అధికారంలోకి తెచ్చారు. అదే సమయంలో కేంద్రంలో రెండో సారి యూపీఏ ప్రభుత్వం ఏర్పాటుకు కీలకమైన 34 సీట్లను గెలిపించారు. అప్పటికే ప్రజాదర్బార్, పేదలకు దగ్గరయ్యే పధకాల అమలుతో హైకమాండ్ మెప్పు పొందారు. అదే సమయంలో పార్టీలో వ్యతిరేకించే నేతల సంబంధీకులకు కేబినెట్ లో అవకాశం కల్పించి వారిని సైతం కంట్రోల్ చేసారు.

వైఎస్సార్ తరహాలో: ఇప్పుడు రేవంత్ అచ్చం వైఎస్ తరహాలోనే ముందుకు వెళ్తున్నారు. తాజా ఎన్నికల్లో పార్టీని గెలిపించే బాధ్యద తనదేనని నమ్మించారు. అభ్యర్దులను పార్టీ ఖరారు చేసినా..తెర వెనుక వారిని ఎంపిక చేసింది రేవంత్. ఇక..ఇప్పుడు గ్యారంటీ పథకాల అమలు పైన హామీ ఇచ్చారు. త్వరలో జరగబోయే లోక్ సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ కు మెజార్టీ సీట్లు తెప్పించే బాధ్యత తదనేని రేవంత్ పార్టీ హైకమాండ్ కు హామీ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలవటంతో పార్లమెంట్ సీట్లు కీలకంగా భావించే కాంగ్రెస్ హైకమాండ్ మరో ఆలోచన లేకుండా రేవంత్ కు సీఎం పదవి కట్టబెట్టింది. ఇప్పుడు...పాలనా విషయంలో రేవంత్ ఏ విధంగా సక్సెస్ అవుతారనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications