హుకుం జారీ చేసిన జగ్గా రెడ్డి..!!
Jagga Reddy: తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటై మూడు రోజులే అయింది. కొత్త ప్రభుత్వం ఇంకా కుదురుకోలేదు. పూర్తి స్థాయి మంత్రివర్గమూ ఇంకా ఏర్పాటు కాలేదు. ముఖ్యమంత్రి మినహా మంత్రులు ఇంకా తమ బాధ్యతలనూ స్వీకరించనూ లేదు.
అప్పుడే- కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు తమ ఆధిపత్య ధోరణిని ప్రదర్శించడం మొదలైనట్టే కనిపిస్తోంది. పది సంవత్సరాల పాటు అధికారానికి దూరంగా ఉండటం వల్ల- ఇక ఆ జాప్యాన్ని భర్తీ చేయడానికి రంగంలో దిగారు. అధికార యంత్రాంగంపై పట్టు సాధించేలా తమ ప్రయత్నాలు షురూ చేశారు.

తాజాగా మాజీ శాసన సభ్యుడు తూర్పు జయప్రకాష్ రెడ్డి అలియాస్ జగ్గా రెడ్డి విడుదల చేసిన ఓ వీడియో.. ఇలాంటి అభిప్రాయాన్నే కలిగిస్తోంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కొత్త ఇబ్బందులు సృష్టించడం ఖాయం అనే భావనను కల్పిస్తోంది. ఈ వీడియోపై ప్రతిపక్ష భారత్ రాష్ట్ర సమితి నాయకులు ఘాటు విమర్శలు చేస్తోన్నారు.
సంగారెడ్డి జిల్లాలో అన్ని శాఖలు, విభాగాలకు చెందిన అధికారులందరూ ఎలాంటి ప్రభుత్వ కార్యక్రమాన్ని నిర్వహించాల్సి వచ్చినా.. దానికి తన భార్య నిర్మలను ఆహ్వానించాల్సిందేనంటూ హుకుం జారీ చేశారు జగ్గారెడ్డి. జిల్లా కలెక్టర్, పోలీస్ సూపరింటెండెంట్ మొదలుకుని కిందిస్థాయి అధికారుల వరకు దీన్ని తూచ తప్పకుండా పాటించాల్సిందేనని అన్నారు.
జగ్గారెడ్డి భార్య నిర్మల.. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలుగా వ్యవహరిస్తోన్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో ఏర్పడింది తమ పార్టీ ప్రభుత్వమే కావడం వల్ల అధికారులు ఆమెను ప్రతి కార్యక్రమానికీ తప్పకుండా ఆహ్వానించాల్సి ఉంటుందని అన్నారు. దీన్ని తన ఆదేశాలుగా భావించాలని చెప్పారు.
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో జగ్గా రెడ్డి ఓడిపోయిన విషయం తెలిసిందే. సంగారెడ్డి నుంచి పోటీ చేసిన ఆయన తన ప్రత్యర్థి, బీఆర్ఎస్‌కు చెందిన అభ్యర్థి చింతా ప్రభాకర్ చేతిలో పరాజయాన్ని చవి చూశారు. 8,217 ఓట్ల తేడాతో ఓటమి చవి చూశారు.












Click it and Unblock the Notifications