బీఆర్ఎస్‌ను గెలిపించడనికి తీవ్రంగా శ్రమిస్తున్నకాంగ్రెస్ నేతలు!!
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుపు ఆశలే లేని భారత రాష్ట్ర సమితిని గెలిపించేందుకు కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. రాజకీయాలు ఎలా అయితే చేయకూడదో అలా చేస్తూ పరోక్షంగా ఆ పార్టీకి గెలుపు అవకాశాలు కల్పిస్తున్నారు. సానుభూతిపై గెలిచేందుకు బీఆర్ఎస్ కష్టపడుతుండగా, వేడినీళ్లకు చన్నీళ్లు తోడన్నట్లు కాంగ్రెస నేతలు తమవంతుగా సాయం చేస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. మాగంటి గోపీనాథ్ సతీమణి సునీత భర్తను తలుచుకొని భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకున్నారు.
గెలుపును సంక్లిష్టం చేశారు
ఇప్పుడు కాంగ్రెస్ నేతలు ఆ కన్నీటి గురించి అనుచిత వ్యాఖ్యలు చేస్తూ సానుభూతిని మరింత పెంచేస్తున్నారు. ఎన్నికల్లో గెలుపొందేందుకు సానుభూతి దక్కేలా కావాలనే ఆమె స్టేజీపైనే ఏడుస్తున్నారంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. దొరికిందే అవకాశంగా బీఆర్ఎస్ ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో తీవ్రంగా వైరల్ చేయిస్తోంది. కాంగ్రెస్ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ తోపాటు స్థానిక నాయకులు కూడా ఇలా మాట్లాడి విమర్శల పాలవడంతోపాటు కాంగ్రెస్ గెలుపును కూడా సంక్లిష్టం చేస్తున్నారు.

మరణించిన వ్యక్తి గురించి మాట్లాడకూడదు
మరణించిన వ్యక్తి గురించి ఎవరూ కూడా తప్పుగా మాట్లాడరు. అది మన సంప్రదాయం. ఆయన జీవించి ఉన్నప్పుడు రాజకీయంలో భాగంగా కొందరు అభిమానిస్తారు.. మరికొందరు వ్యతిరేకిస్తారు. మరణించిన తర్వాత మాత్రం అందరూ సానుభూతి వ్యక్తం చేస్తారు. ఎవరూ వ్యతిరేకించరు. అయితే మరణించిన వ్యక్తి సతీమణిని, ఆ కుటుంబాన్ని కించపరిస్తే మాత్రం అందరూ తీవ్రంగా వ్యతిరేకిస్తారు. మహిళల్లో తీవ్రమైన వ్యతిరేకత కూడా వ్యక్తమవుతుంది.
రాజకీయ నాయకులకు ఈ విషయం గురించి ప్రత్యేకంగా వివరించి చెప్పాల్సిన అవసరంలేదు. వారికి తెలుసు. కాంగ్రెస్ తరఫున పోటీచేస్తున్న నవీన్ యాదవ్ కూడా మాగంటి గోపీనాథ్ మరణం దైవ నిర్ణయం అన్నారు. ఆయన ఒక అభిప్రాయంతో చెబితే బీఆర్ఎస్ వేరే అభిప్రాయంతో ప్రచారం చేస్తోంది. కానీ ఆ వ్యాఖ్యల వెనక దురుద్దేశం ఉందంటూ వాటిని సోషల్ మీడియాలో తిప్పుతూ ప్రచారం చేయిస్తోంది. ఇవన్నీ కలిసి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ కొంప కూల్చనున్నాయా? అనే సందేహాన్ని రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications