జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్ధి ఖరారు వేళ బిగ్ ట్విస్ట్..!!
జూబ్లీహిల్స్ బై పోల్ కోసం పార్టీలు సమాయత్తం అవుతున్నాయి. ఇప్పటికే అభ్యర్ధుల ఖరారు పైన ఒక అంచనాకు వచ్చాయి. అధికారికంగా ప్రకటించటమే మిగిలింది. వచ్చే నెలలో ఉప ఎన్నిక పై షెడ్యూల్ విడుదల కానుంది. బీఆర్ఎస్ నుంచి మాగంటి గోపీనాథ్ సతీమణి అభ్యర్దిగా బరిలోకి దిగనున్నారు. కాంగ్రెస్ అభ్యర్ధి దాదాపు ఖరారైన వేళ.. అనూహ్యంగా మాజీ మంత్రి ఎంట్రీ ఇవ్వటం తో సమీకరణం ఒక్కసారిగా మారిపోయింది. దీంతో, ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్ధి ఎవరనే ఉత్కంఠ మొదలైంది.
సీటు దక్కేదెవరికి
జూబ్లీహిల్స్ సీటు నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన అజాహరుద్దీన్ భావించారు. అయితే, స్థానికం గా నియోజకవర్గంలో సామాజిక సమీకరణాలు.. పార్టీల బలాల ఆధారంగా సీఎం రేవంత్ కొత్త వ్యూహం అమలు చేస్తున్నారు. అందులో భాగంగా సీటు కోసం ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు చేసిన అజాహరుద్దీన్ ను పోటీ లేకుండా చట్ట సభలకు ఎంపిక చేసారు. దీంతో.. ఇప్పుడు రేవంత్ ఆలోచన లకు అనుగుణంగా జూబ్లీహిల్స్ బై పోల్ అభ్యర్ధి ఖరారు కానున్నారు. ఈ రేసులో ఇప్పటి వరకు ప్రధానంగా నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్, రహ్మత్‌నగర్ కార్పొరేటర్ సీఎన్ రెడ్డి పేర్లు ప్రచారం లో ఉండగా.. మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి పేరు పైన సర్వే చేయించటం సంచలనంగా మారుతోంది. కాగా.. మాజీ మంత్రి దానం నాగేందర్ సైతం తనకు అవకాశం ఇవ్వాలని కొత్త ప్రతిపాదన తెర మీదకు తీసుకొచ్చారు.

కొత్త వ్యూహాలు
గులాబీ పార్టీ నుంచి దివంగత గోపినాథ్ సతీమణి మాగంటి సుజాత బరిలో దిగుతుందని ఇప్పటికే కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సంకేతాలిచ్చారు. దీంతో ఆమె కాలనీలు, బస్తీల్లో గోపినాథ్ సంతాపసభలు నిర్వహిస్తున్నారు. గోపినాథ్ తనయలూ క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. ఉప ఎన్నికల్లో విజయం లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. పార్టీ కార్యకర్తలతో రెండు పర్యాయాలు నాయకులు ఉప ఎన్నికల సన్నాహాక సమావేశం నిర్వహించారు. ఇటు కాంగ్రెస్ నుంచి జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్‌లకు ఎన్నికల బాధ్యతలు అప్పగించింది. పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఇతర నేతలనూ భాగస్వాములను చేస్తున్నారు.
తుది కసరత్తు
ఇక, బీజేపీ నుంచి లంకల దీపక్‌రెడ్డి, కీర్తిరెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, మాధవీలత, డాక్టర్ పద్మవిపనేని, మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహారావు మనుమడు ఎన్‌వీ సుభాష్ అభ్యర్థిత్వం ఆశిస్తున్నారు. వీరిలో ఎవరికి అవకాశం దక్కుతుందన్న దానిపై సస్పెన్స్ నెలకొంది. అయితే.. గోపీనాధ్ సానుభూతి ఓటింగ్ తో పాటుగా మైనార్టీల ఓటింగ్ డిసైడింగ్ ఫ్యాక్టర్ గా భావిస్తున్నారు. ఎంఐఎం పోటీలోకి దిగటం పైన స్పష్టత రావాల్సి ఉంది. బీఆర్ఎస్ సైతం ఎంఐఎం నిర్ణయం కోసం వేచి చూస్తోంది. కాగా.. బీజేపీకి... టీడీపీ నేతలు సైతం మద్దతుగా నిలుస్తున్నారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగా సహకరించనుంది. నియోజకవర్గంలో పరిస్థితులను తమకు అనుకూలంగా మలచుకునేందుకు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. దసరా వేళ అభ్యర్ధుల పైన అధికారికంగా ప్రకటన రానుంది.












Click it and Unblock the Notifications