చంద్రబాబు అరెస్టుపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్: తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిణామాలపై భువనగిరి ఎంపీ, కాంగ్రెస్ కీలక నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీనేనని స్పష్టం చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన కోమటిరెడ్డి.. తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్టుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
టీవీ ఛానళ్లలో చంద్రబాబు కేసులకు సంబంధించిన కథనాలు వస్తుంటే.. వెంటనే టీఫ్ ఆఫ్ చేస్తున్నానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. చంద్రాబుకు సంబంధించిన వార్తలు చదవడమే మానేశానని చెప్పారు. అసలు చంద్రబాబు నాయుడు అరెస్టుపై తానేమీ మాట్లాడదల్చుకోలేదని అన్నారు. అయినా, ఆంధ్రా గురించి తమకెందుకు? అంటూ ఆ అంశాన్ని దాటవేశారు.

ఇప్పుడు తమ దృష్టి అంతా కేసీఆర్‌ను సీఎం కుర్చీ నుంచి దించడంపైనే ఉంటుందన్నారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే తమ పార్టీ ఇచ్చిన 6 హామీలను అమలు చేస్తామని స్పష్టం చేశారు. తాము చేసే చెబుతామని, చెప్పింది చేసి తీరుతామన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కచ్చితంగా 80 నుంచి 85 సీట్లు వస్తాయని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
ఈసారి కేసీఆర్ ఇంటికి వెళ్లడం ఖాయమన్నారు కోమటిరెడ్డి. డబ్బు తీసుకుని టికెట్లు ఇచ్చే సంస్కృతి కాంగ్రెస్ పార్టీలో లేదన్నారు. టిక్కెట్ల అంశంపై పార్టీ అధిష్టానంతో మాట్లాడుకుంటానని స్పష్టం చేశారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. పార్టీలో ఉన్న సమస్యలపై కూడా ఢిల్లీలోనే మాట్లాడుతానని కోమటిరెడ్డి తెలిపారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు తప్పక నెరవేరుస్తుందని అన్నారు.
హరీశ్ రావుకు కోమటిరెడ్డి సవాల్
మరోవైపు, బీఆర్ఎస్ సర్కారుపై విమర్శలు గుప్పించారు కోమటిరెడ్డి. కాంగ్రెస్ లక్ష్యంగా మంత్రి హరీష్ రావు ఇటీవల చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. 'హరీశ్.. బీఆర్‌ఎస్‌లో ఏం జరుగుతుందో తెలుసుకో' అంటూ మంత్రికి హితవు పలికారు. కోట్ల రూపాయకు టిక్కెట్లు అమ్ముకోలేదా? అని ప్రశ్నించారు. టిక్కె్ట్లు అమ్ముకునే పరిస్థితి బీఆర్‌ఎస్‌లోనే ఉందన్నారు.

మంత్రి హరీష్ రావుకు దమ్ముంటే తన సవాల్‌ను స్వీకరించాలన్నారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. తెలంగాణలో వ్యవసాయానికి 24గంటల కరెంట్ ఇస్తున్నట్టు నిరూపిస్తే ఎంపీ పదవికి రాజీనామా చేస్తానంటూ సవాల్ విసిరారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఒకవేళ నిరూపించకపోతే హరీష్ రావు తన పదవికి రాజీనామా చేస్తారా? అని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్ పేరు మార్చుకున్నప్పుడే ఆ పార్టీ కథ ముగిసిందని వ్యాఖ్యానించారు.
బీఆర్‌ఎస్‌గా పేరు మార్చుకున్న పార్టీ.. ఇతర రాష్ట్రాల్లో ఎందుకు పోటీ చేయడం లేదని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌ది రజాకార్ల పాలన అని విమర్శించారు. కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో అమలవుతున్న పథకాలపై చర్చించేందుకు తాము సిద్ధమన్నారు కోమటిరెడ్డి. తామే ఫ్లైట్ బుక్ చేస్తామని.. కర్ణాటకలో అమలవుతున్న పథకాలు తెలుసుకునేందుకు రావాలని బీఆర్ఎస్ నేతలకు కోమటిరెడ్డి సవాల్ విసిరారు. పోటీ పరీక్షలను కూడా ఈ ప్రభుత్వం నిర్వహించలేకపోతోందని మండిపడ్డారు. ఇతర రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తేదీనే జీతాలు వస్తుంటే.. తెలంగాణలో మాత్రం జీతం కోసం ఉద్యోగులు ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉందన్నారు.












Click it and Unblock the Notifications