కాంగ్రెస్‌లో షర్మిలకు దక్కేదేంటీ? తేల్చేసిన డీకేశి..?!
హైదరాబాద్: కర్ణాటకలో అధికార భారతీయ జనతా పార్టీని మట్టికరిపించిన ఊపు మీద ఉంది కాంగ్రెస్. ఇక ఈ ఏడాది చివర్లో జరిగే వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి సారించింది. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లల్లో అధికారాన్ని నిలబెట్టుకోవడం, తెలంగాణ, మధ్యప్రదేశ్, మిజోరంలల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన వ్యూహాలను రూపొందించుకునే పనిలో ఉంది.
తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోని భారత్ రాష్ట్ర సమితిని ఎదుర్కొనడానికి అవసరమైన కసరత్తు ఆరంభించింది కూడా. ఇందులో భాగంగా ఇప్పటికే అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా తెలంగాణలో పర్యటించారు. బహిరంగసభను ఉద్దేశించి మాట్లాడారు. తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్‌గా ఆమె బాధ్యతలను సైతం వెనుకాడట్లేదు.

బీఆర్ఎస్‌ను ఎదుర్కొనడంలో భాగంగా- భావసారూప్యం గల పార్టీలను కలుపుకెళ్లాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇప్పటికే వామపక్షాలు బీఆర్ఎస్‌కు మద్దతు ప్రకటించిన నేపథ్యంలో.. కాంగ్రెస్ పార్టీ దృష్టి వైఎస్ షర్మిలపై పడింది. వైఎస్ఆర్టీపీని విలీనం చేసుకోవడమా? లేక పొత్తు పెట్టుకుని అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లడమా? అనే విషయంపై తుది నిర్ణయాన్ని తీసుకోవాల్సి ఉంది.
కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవాలని వైఎస్ షర్మిల భావిస్తోన్నారు. దీనికి అనుగుణంగా ఆమె పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలో తమ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందిన భువనగిరి లోక్‌సభ సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని రంగంలోకి దించారు. ఆయన ద్వారా పొత్తు ప్రతిపాదనలను తెలంగాణ కాంగ్రెస్ అగ్ర నాయకత్వానికి పంపించారు. పొత్తు పెట్టుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాననే సంకేతాలను పంపించారు.
షర్మిల పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధినేత రేవంత్ రెడ్డికి ఏ మాత్రం ఇష్టంలేదనే వాదనలు వినిపిస్తోన్నాయి. ఆమెతో పొత్తు కంటే వైఎస్ఆర్టీపీని విలీనం చేసుకోవడమే మంచిదనే అభిప్రాయంలో ఉన్నారాయన. ఈ రివర్స్ ప్రపోజల్స్‌కు వైఎస్ షర్మిల అంగీకరిస్తే- తనకు ఎలాంటి అభ్యంతరం లేదని రేవంత్ రెడ్డి చెబుతున్నట్లు తెలుస్తోంది.

దీనికి కారణాలు లేకపోలేదు. తమపై విమర్శలు గుప్పించడానికి బీఆర్ఎస్‌కు అవకాశం ఇచ్చినట్టవుతుందని రేవంత్ రెడ్డి భావిస్తోన్నారు. తమను ఎదుర్కొనడానికి కాంగ్రెస్- చివరికి ఆంధ్ర నాయకురాలు పెట్టిన కొత్త పార్టీని ఆశ్రయించిందంటూ బీఆర్ఎస్ విమర్శించవచ్చని అంచనా వేస్తోన్నారు. ప్రాంతీయ భావాలను కేసీఆర్, బీఆర్ఎస్ నాయకులు రెచ్చగొట్టవచ్చని, ఇది తమకు మైనస్‌లా మారుతుందనేది రేవంత్ రెడ్డి వాదన.
అటు కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం సైతం దీన్నే సమర్థిస్తోంది. రేవంత్ వాదనలతో ఏకీభవిస్తోంది. షర్మిల పార్టీతో పొత్తు కంటే విలీనమే బెటర్ అనే నిశ్చితాభిప్రాయానికి వచ్చింది కాంగ్రెస్ హైకమాండ్ కూడా. దీనితో చేతులెత్తేసినట్టయింది షర్మిల పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆమె కోమటిరెడ్డి వెంకటరెడ్డితో రాయబారం నడిపిస్తోన్నారని చెబుతున్నారు. షర్మిల పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి కోమటిరెడ్డి అనుకూలంగా ఉంటోన్నారు.

ఈ విషయంలో కోమటిరెడ్డి వాదన- దీనికి పూర్తి భిన్నంగా ఉంటోంది. షర్మిల పార్టీతో పొత్తు పెట్టుకుని.. ఎన్నికల తరువాత విలీనం చేసుకుందామని చెబుతున్నారాయన. విలీనం తరువాత ఆమెను ఏపీ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్‌గా పంపించగలిగితే వైఎస్సార్ అనే కార్డ్ కలిసి వస్తుందనేది కోమటిరెడ్డి అభిప్రాయం. దీనికి రేవంత్ రెడ్డి విభేదిస్తోన్నారు.
ఈ పరిణామాల మధ్య- కోమటిరెడ్డి ఇవ్వాళ బెంగళూరులో కర్ణాటక పీసీసీ చీఫ్, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో భేటీ అయ్యారు. తన ప్రతిపాదనలను ఆయనకు వివరించారు. అటు వైఎస్ కుటుంబానికి డీకేతో సాన్నిహిత్యం ఉన్న నేపథ్యంల- విలీనానికే ఆమెను ఒప్పించేలా చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై డీకే ఒకట్రెండు రోజుల్లో షర్మిలతో మాట్లాడుతారని సమాచారం.












Click it and Unblock the Notifications