14 నుంచి కాంగ్రెస్ ప్రజా విజయోత్సవాలు: భట్టి విక్రమార్క
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనపై నవంబర్ 14 నుంచి డిసెంబర్ 9 వరకు ప్రజా విజయోత్సవాలు (Praja Vijayotsavalu) నిర్వహించనున్నట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ప్రజా విజయోత్సవాలు ఏ విధంగా జరపాలి, ఏ అంశాలపై ప్రచారం చేయాలనే దాని విధివిధానాలు రూపొందించేందుకు భట్టి విక్రమార్క అధ్యక్షతన శనివారం కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది.
ఈ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకోవడంతోపాటు రోడ్ మ్యాప్ సిద్ధం చేశారు. ప్రజా ఉత్సవాల్లో భాగంగా ఉస్మానియా ఆస్పత్రి, స్పోర్ట్స్ వర్సిటీకి శంకుస్థాపన చేస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. నవంబర్ 28న పారామెడికల్, 16 నర్సింగ్ కాలేజీలను ప్రారంభిమస్తామన్నారు. ఉత్సవాల్లో భాగంగా పలు కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంటామని చెప్పారు. గ్రూప్-4కు ఎంపికైన వారికి నియామకపత్రాలు అందజేస్తామన్నారు.

డిసెంబర్ 9న హైదరాబాద్ నగరంలో భారీగా ప్రజా విజయోత్సవాలు నిర్వహిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వివరించారు. దివంగత మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జయంతి రోజున ప్రజా విజయోత్సవాలు ప్రారంభించి, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ పుట్టిన రోజు వరకు నిర్వహించే విధంగా ప్రణాళికలు రూపొందించింది. విజయోత్సవాల్లో భాగంగా భారీగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ఈ 25 రోజులపాటు వివిధ రకాల కార్యక్రమాలతో పాటు పలు కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్‌లో చేపట్టబోయే కార్యక్రమాలపైనా ప్రజలకు ఈ సందర్భంగా వివరించనున్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుంచి మొదలుపెట్టి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామస్థాయి వరకు ఈ సంబరాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.












Click it and Unblock the Notifications