తెలంగాణకు రాహుల్ గాంధీ, ప్రియాంక, ఖర్గే: షెడ్యూల్ ఇదే
తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అధికారం చేపట్టిన కాంగ్రెస్.. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. సీఎం, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితోపాటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఇప్పటికే పలుమార్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
తాజాగా, మరోసారి తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు సిద్ధమయ్యారు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక గాంధీ, మల్లిఖార్జున ఖర్గేల పర్యటనలకు సంబంధించిన షెడ్యూల్‌ను పీసీసీ విడుదల చేసింది.

గురువారం ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్నారు. సాయంత్రం 4 గంటలకు నర్సాపూర్ జన జాతర సభలో పాల్గొంటారు. ఆ తర్వాత 6 గంటలకు ఎల్బీనగర్ సరూర్ నగర్ స్టేడియంలో జనజాతర సభకు హాజరవుతారని పీసీసీ తెలిపింది. రాహుల్ గాంధీతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పాల్గొంటారని తెలిపింది.
మే 10వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడతారు. ఆ తరువాత సాయంత్రం 4 గంటలకు నకిరేకల్‌లో జన జాతర సభకు హాజరవుతారు. మరోవైపు, మే 10వ తేదీన ఉదయం 10 గంటలకు పటాన్చెరు కార్నర్ మీటింగ్‌లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. సాయంత్రం 4 గంటలకు మక్తల్ కార్నర్ మీటింగ్‌లో ఉంటుంది.
అదేరోజు సాయంత్రం 6 గంటలకు షాద్ నగర్ కార్నర్ సమావేశంలో ఏఐసీసీ అగ్రనేత ప్రియాంక గాంధీలతో కలిసి సభలో సీఎం రేవంత్ పాల్గొంటారని షెడ్యూల్‌లో కాంగ్రెస్ పేర్కొంది. మే 11న ప్రియాంక గాంధీ ఉదయం 11 గంటలకు కామారెడ్డి, మద్యాహ్నం 1 గంటకు తాండూరు ఎన్నికల సభల్లో పాల్గొంటారు. ఇందు కోసం కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications