మరో గుడ్‌న్యూస్! తెలంగాణలో కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ: ఎప్పట్నుంచంటే.?
ఏప్రిల్ నుంచి కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరణ చేయనున్నట్లు మంత్రి హరీశ్ రావు తెలిపారు. సెర్ప్ ఉద్యోగుల పేస్కేల్ సవరణ చేయబోతున్నట్లు ప్రకటించారు.
హైదరాబాద్: కాంట్రాక్టు ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. తెలంగాణ బడ్జెట్ 2023ని అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సందర్భంగా ఆర్థిక మంత్రి హరీశ్ రావు కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర అభివృద్ధిలో ఉద్యోగులది కీలకమైన భాగస్వామ్యమని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులతోపాటు సమానంగా అంగన్‌వాడీ, ఆశా, ఇంకా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఫిట్‌మెంట్ ఇవ్వడం, దానిని ఏకకాలంలో వర్తింపచేయడం దేశంలోనే ప్రథమమని వెల్లడించారు.

తెలంగాణలో కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ
ఏప్రిల్ నుంచి కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరణ చేయనున్నట్లు మంత్రి హరీశ్ రావు తెలిపారు. సెర్ప్ ఉద్యోగుల పేస్కేల్ సవరణ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తుల మేరకు కొత్త ఈహెచ్‌ఎస్ విధానాన్ని ఈ ఆర్థిక సంవత్సరంలో తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు.

ఇది తెలంగాణ ప్రభుత్వం సాధించిన చారిత్రక విజయమన్న హరీశ్
గతంలో స్థానికులకు 60 నుంచి 80 శాతం వరకు మాత్రమే లోకల్ రిజర్వేషన్లు ఉండేదని.. ఇప్పుడు మాత్రం అములు చేస్తున్న నూతన నియామక విధానంతో అటెండర్ నుంచి ఆర్డీవో దాకా స్థానికులకే 95 శాతం ఉద్యోగాలు లభిస్తాయని హరీశ్ రావు వివరించారు. కొత్త నియామకాలు ఈ పద్ధతిలోనే జరుగుతున్నాయని, ఇది తెలంగాణ ప్రభుత్వం సాధించిన చారిత్రాత్మక విజయమని హరీశ్ రావు పేర్కొన్నారు.

కొత్త ఉద్యోగుల కోసం వెయ్యి కోట్లు కేటాయించామన్న హరీశ్ రావు
2014 జూన్ నుంచి ఫిబ్రవరి 2022 దాకా ప్రత్యక్ష నియామక విధానం ద్వారా 1,61,572 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు. వీటిలో 1,41,735 పోస్టుల ప్రక్రియ పూర్తయింది. కొత్త ఉద్యోగుల జీతభత్యాల కోసం ఈ బడ్జెట్‌లో రూ. 1000 కోట్లు అదనంగా ప్రతిపాదిస్తున్నామన్నారు ఆర్థిక మంత్రి హరీశ్ రావు. ఎంప్లాయిస్ హెల్త్ కేర్ ట్రస్టును ఏర్పాటు చేసి ఇందులో ప్రభుత్వ ప్రతినిధులతోపాటు ఉద్యోగ, ఉపాధ్యాయ, రిటైర్డ్ ఉద్యోగుల ప్రతినిధులను భాగస్వాములుగా చేస్తామన్నారు. దీనికి సంబంధించి విధి విధానాలను త్వరలోనే ప్రకటిస్తామని హరీశ్ రావు వెల్లడించారు.












Click it and Unblock the Notifications