తెలంగాణాలో కరోనా పంజా ... 24 గంటల్లో 1,097 కొత్త కరోనా కేసులు , 6 మరణాలు
భారతదేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఇక తెలంగాణ రాష్ట్రంలోనూ కరోనా కేసులు రోజురోజుకీ తీవ్రరూపం దాలుస్తున్నాయి. తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ రాష్ట్ర ప్రజలను వణికిస్తోంది. అంతకంతకు కేసులు పెరుగుతున్న తీరు తెలంగాణ రాష్ట్రంలో ఆందోళనకు కారణం అవుతుంది . అధికారికంగా నమోదైన కేసులు కంటే, అనధికారికంగాను భారీగా కేసులు వెలుగుచూస్తున్న పరిస్థితి ఉంది .
ఏపీపై కరోనా పంజా .. కొత్తగా 1398 కేసులు, 9 మరణాలు , పెరుగుతున్న యాక్టివ్ కేసులు

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మొత్తం కరోనా కేసులు 3,13,237
తాజాగా తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం గడచిన 24 గంటల్లో 1,097 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తాజాగా కరోనా మహమ్మారి కారణంగా ఆరుగురు మృతి చెందినట్లుగా అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మొత్తం కరోనా కేసులు 3,13,237 కాగా, తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 8746 కు పెరిగింది . గడచిన 24 గంటల్లో 40,370 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా వెయ్యికి పైగా కేసులు నమోదయ్యాయి .

కరోనా మృతుల సంఖ్య 1,723 , గత 24 గంటల్లో 6 మరణాలు
శనివారంతో పోల్చుకుంటే ఆదివారం రోజు నమోదైన కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య కాస్త తగ్గటం ప్రస్తుతానికి ఊరట కలిగిస్తోంది.
కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటివరకూ ఆరుగురు ప్రాణాలు కోల్పోగా రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కరోనా మృతుల సంఖ్య 1,723 కు చేరుకుంది. నిన్న ఒక రోజే కరోనా బారినుండి కోలుకుని బయటపడిన వారు 268 మంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 4458 మంది బాధితులు హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు.

తాజాగా హైదరాబాద్లో 302 కరోనా కేసులు
మరోవైపు జిహెచ్ఎంసి పరిధిలో కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్న తీరు హైదరాబాద్ వాసులకు ఆందోళన కలిగిస్తుంది . తాజాగా హైదరాబాద్లో 302 కరోనా కేసులు నమోదయ్యాయి.
ఇక రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాలలో భారీగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలో కరోనా విజృంభిస్తోంది . నిజామాబాద్ జిల్లాలో గత 20 రోజుల్లోనే 865 మందికి కరోనా వైరస్ సోకడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.

కరోనా కేసుల పెరుగుదల .. అప్రమత్తంగా ఉండాలంటున్న సర్కార్
ప్రభుత్వ యంత్రాంగం ఐసోలేషన్ ఏర్పాటు చేయాలని అధికారులకు మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. రోజురోజుకీ కరోనా కేసులు పెరుగుతున్న తీరు తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఆందోళనకు గురి చేస్తూ ఉండగా, ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది. ప్రజలందరూ బాధ్యతాయుతంగా ఉండాలని సామాజిక దూరం పాటించాలని , మాస్కులు ధరించాలని పదే పదే విజ్ఞప్తి చేస్తోంది.
ఇంతగా కేసులు పెరుగుతున్నా ప్రజలు ఇంకా అలెర్ట్ గా లేకపోవటం కేసుల పెరుగుదలకు కారణంగా మారుతుంది .