టీఆర్ఎస్ -సీపీఎం కొత్త పొత్తు : మునుగోడు సర్వేలో తేలిందిందే..!!
తెలంగాణలో కొత్త పొత్తులు పొడుస్తున్నాయి. మునుగోడు బై పోల్ తో ప్రారంభం అయిన ఈ పొత్తులు జాతీయ స్థాయి వరకు కొనసాగనున్నాయి. మునుగోడు బై పోల్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ అక్కడ వామపక్షాల ప్రభావం కారణంగా..వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే సీపీఐ నేతలతను తనతో కలుపుకొని మునుగోడు సభలో పాల్గొన్నారు. బీజేపీని ఓడించే శక్తి టీఆర్ఎస్ కు మాత్రమే ఉందని చెబుతూ సీపీఐ నేతలు టీఆర్ఎస్ తో జత కట్టారు. ఇప్పుడు..తాజాగా సీపీఎం నేతలు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ తో సమావేశమయ్యారు.
మునుగోడులో టీఆర్ఎస్ కు మద్దతు ఇచ్చేందుకు అంగీకరించారు. అదే సమయంలో రాష్ట్రంలో ఉన్న పోడు భూముల వ్యవహారం పైన సీపీఎం నేతలు చేసిన అభ్యర్ధనకు ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. మునుగోడుతో పాటుగా బీజేపీ వ్యతిరేకంగా నిర్వహించాల్సిన కార్యాచరణ పైనా వీరి మధ్య చర్చకు వచ్చింది. జాతీయ స్థాయిలోనూ పొత్తు కొనసాగించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. అయితే, కాంగ్రెస్ తో జాతీయ స్థాయిలో వామపక్షాల పొత్తు కొనసాగుతోంది. తెలంగాణలో ఇప్పుడు కేసీఆర్ బీజేపీకి వ్యతిరేకంగా నిలబడటంతో మద్దతు ఇస్తున్నామని సీపీఎం నేతలు చెప్పుకొచ్చారు.

ఇక, ఇదే సమయంలో మునుగోడులో తాజాగా నిర్వహించిన సర్వే ఫలితాలను ముఖ్యమంత్రి కేసీఆర్ సీపీఎం నేతలకు వివరించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మునుగోడులో టీఆర్ఎస్ ఆధిక్యతలో ఉన్నట్లుగా వెల్లడైన సర్వే ఫలితాల పైన చర్చ జరిగింది. అయితే, ఎన్నికల పోలింగ్ పూర్తయ్యే వరకూ అప్రమత్తంగా వ్యవహరించాలని నిర్ణయించారు. అభ్యర్ధి ఎంపిక నుంచి ప్రచారం వరకు టీఆర్ఎస్ - వామపక్షాలతో కలిసే నిర్ణయాలు ఉంటాయని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఈ నెల 9 లేదా 10వ తేదీల్లో మరోసారి ముఖ్యమంత్రి..సీపీఎం నేతల మధ్య మలి విడత చర్చలు జరగనున్నాయి.












Click it and Unblock the Notifications