తుపాకీతో కాల్చుకుని సీఆర్పీఎఫ్ జవాను ఆత్మహత్య: ప్రేమ వ్యవహారమే కారణమా?
హైదరాబాద్: సికింద్రాబాద్ పరిధిలోని బేగంపేటలో విషాద ఘటన చోటు చేసుకుంది. సీఆర్పీఎస్ కానిస్టేబుల్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. గురువారం తెల్లవారుజామున బేగంపేటలోని చికోటి గార్డెన్ వద్ద సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ దేవేందర్ సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
మృతుడు దేవేందర్ ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందినవారు. సీఆర్పీఎఫ్ ఐజీ మహేశ్ చంద్ర వద్ద ఆయన విధులు నిర్వహిస్తున్నారు. కానిస్టేబుల్ దేవేందర్ ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని బేగంపేట పోలీసులు అనుమానిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం అతడి మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

పెళ్లికి నిరాకరించిన యువతిని కాల్చి చంపాడు :మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ధార్ పట్టణంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తనని పెళ్లి చేసుకునేందుకు నిరాకరించిందని ఓ యువతిని నడిరోడ్డుపై ఒక యువకుడు కాల్చి చంపాడు. అనంతరం నిందితుడు పరారయ్యాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బ్రహ్మాకుంద్ అనే 22 ఏళ్ల పూజ అనే అమ్మాయి తన తల్లి, ఇద్దరు చెల్లెళ్లతో నివాసం ఉంటోంది. ఆమెది పేద కుటుంబం కావడంతో ఆమె ధార్‌లోని ఓ హటల్‌లో పనిచేస్తోంది. అదే గ్రామానికి చెందిన దీపక్ రాథోడ్ కొన్నేళ్లుగా ఆమె చుట్టూ తిరుగుతూ పెళ్లి చేసుకోవాలంటూ వేధిస్తున్నాడు. అంతేగాక, ఆమె కుటుంబసభ్యులను కూడా బెదిరించాడు. దీంతో విసిగిపోయిన పూజ జిల్లా కోర్టులో అతడిపై ఫిర్యాదు చేసింది. ఈ ఘటనతో ఆగ్రహించిన దీపక్.. ఆమెను చంపాలని నిర్ణయించుకున్నాడు.
పూజ రోజు విధులకు వెళ్లే మార్గంలో కాపు కాచి.. తుపాకితో ఆమెను కాల్చి చంపాడు. అనంతరం అక్కడ్నుంచి పరారయ్యాడు. స్థానికుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. దీపక్ ఇంటికి వెళ్లగా.. పోలీసులను గమనించి వారిపై కాల్పులు జరిపాడు. పోలీసులు కూడా ఎదురుకాల్పులు జరిపి అతడ్ని అరెస్ట్ చేశారు.












Click it and Unblock the Notifications