cyclone michaung: తెలంగాణలోని ఈ జిల్లాల్లోనూ అత్యంత భారీ వర్షాలు, సీఎస్ కీలక ఆదేశాలు
మిచౌంగ్ తుపాను (cyclone michaung) ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు చేసిన నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిస్తున్న క్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి.. జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
రెండు రోజులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లను ఆదేశించారు. భారీ వర్షాలు, వరదలు వచ్చే ఉన్నందున ముందు చర్యలు చేపట్టాలని సూచించారు. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాలకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపించాలన్నారు. ఇప్పటికే పూర్తిగా నిండిన చెరువులకు గండ్లు పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు.

నీటిపారుదల శాఖ, విపత్తు నిర్వహణ శాఖ, రోడ్లు భవనాలు, పంచాయతీరాజ్, రెవెన్యూ శాఖలు అప్రమత్తంగా ఉండాలని సీఎస్ సూచించారు. ప్రధానంగా వరదలు వచ్చే అవకాశం ఉన్న లోతట్టు ప్రాంతాల వద్ద జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అవసరమైతే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని , అందుకు తగిన విధంగా పునరావాస కేంద్రాలను ముందుగానే గుర్తించాలని ఆదేశించారు సీఎస్ శాంతికుమారి.
ఏపీతోపాటు తెలంగాణ జిల్లాల్లోనూ వర్షాలు
మిచౌంగ్ తుఫాను కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తర, దక్షిణ కోస్తా జిల్లాలతోపాటు రాయలసీమలోని పలు ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక, ఈ తుఫాను ప్రభావంతో తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ, అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.












Click it and Unblock the Notifications