నిన్న చేరిక.. నేడు రాజీనామా: కాంగ్రెస్ వాళ్లు రావొద్దంటూ డీఎస్ సతీమణి వీడియో
సీనియర్ రాజకీయ ధర్మపురి శ్రీనివాస్(డీఎస్) తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరిక ఆయన కుటుంబంలో చిచ్చురేపినట్లు తెలుస్తోంది. ఆదివారం కుమారుడు సంజయ్‌తో కలిసి గాంధీభవన్‌కు వచ్చి కాంగ్రెస్ పార్టీలో డీఎస్ చేరిన విషయం తెలిసిందే. అయితే, ఒకరోజు తర్వాత సోమవారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం గమనార్హం. డీఎస్ మరో కుమారుడు ధర్మపురి అరవింద్ బీజేపీలో కొనసాగుతూ నిజామాబాద్ ఎంపీగా ఉన్నారు.
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గేకు తన రాజీనామా లేఖను డీఎస్ పంపారు. డీఎస్ రాజీనామా లేఖ రాస్తున్నట్లు ఉన్న వీడియోను ఆయన భార్య విజయలక్ష్మి విడుదల చేశారు. కాంగ్రెస్ పార్టీకి డీఎస్ రాజీనామా చేశారని పేర్కొన్నారు. రాజీనామా లేఖను టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి కూడా పంపారు.\డీఎస్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారని ఆయన భార్య విజయలక్ష్మి తెలిపారు. డీఎస్ ఆరోగ్యం సహకరించట్లేదని.. కాంగ్రెస్ వాళ్లు తమ ఇంటికి రావద్దని ఆమె స్పష్టం చేశారు.

'ఇగో డీఎస్ గారి రాజీనామా! ఇది రాజకీయాలు చేసే సమయం కాదు! ఆయనను మీరు పార్టీలో చేర్చుకునే పద్ధతి కూడా ఇది కాదు. ఆయనకు బ్రెియన్ స్ట్రోక్ వచ్చి, పక్షవాతం కూడా వచ్చింది. దయచేసి, మీ రాజకీయాలకు ఆయనను వాడుకోవద్దు. మీరు నిన్న పెట్టిన ఒత్తిడికి ఆయనకు ఫిట్స్ కూడా వచ్చింది. కాంగ్రెస్ వాళ్లకు చేతులు జోడించి దండం పెడుతున్న.. ఇంకోసారి ఇటువైపు రాకండి. ఈ వయసులో అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను కొంచెం ప్రశాంతంగా బతకనీయండి' అని డీఎస్ సతీమణి విజయలక్ష్మి కూడా ఓ లేఖను విడుదల చేశారు.
కాంగ్రెస్‌కు షాకిచ్చిన డీఎస్..నిన్న జాయిన్ నేడు ఎగ్జిట్#Dsrinivas #Telanganacongress #oneindiatelugu pic.twitter.com/S64PdDSAXK
— oneindiatelugu (@oneindiatelugu) March 27, 2023
'ఈ నెల 26న నా కుమారుడు డీ సంజయ్ కాంగ్రెస్ పార్టీలో తిరిగి చేరిన సందర్భంగా ఆశీస్సులు అందజేయడానికి గాంధీభవన్ కు వెళ్లిన నాకు కండువా కప్పి మళ్లీ పార్టీలో చేరినట్లుగా మీడియాలో ప్రచారం చేయడం జరిగింది. నేను ఎప్పటికీ కాంగ్రెస్ వాదినే కానీ, ప్రస్తుతం నా వయస్సు, ఆరోగ్య పరిస్థితుల దృష్త్యా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండదలుచుకున్నాను.
పార్టీలో నా చేరికకూ, నా కుమారుడు సంజయ్ టికెట్‌కు ముడిపెట్టడం భావ్యం కాదు. కాంగ్రెస్ పార్టీ విధివిధానాలు, సంప్రదాయాలు, ప్రజామోదం మేరకే పార్టీ టికెట్లు కేటాయింపు జరుగుతుందన్న విషయం మనకు తెలియనది కాదు. ఆరోగ్య రీత్య క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్న నన్ను వివాదాల్లోకి లాగవద్దని విజ్ఞప్తి చేస్తూ.. కాంగ్రెస్ పార్టీలో నేను మళ్లీ చేరానని భావిస్తే ఈ లేఖను రాజీనామాగా భావించి, ఆమోదించవలసిందిగా కోరుకుంటున్నాను' అని మల్లిఖార్జున్ ఖర్గేకు డీఎస్ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications