బాబు ఉదయం లేచేలా చేశారా, తెలంగాణ ఎలా నష్టపోయిందో: డిఎస్, కెసిఆర్‌కూ...
హైదరాబాద్: ఇటీవలె తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరిన మాజీ పిసిసి అధ్యక్షులు డి శ్రీనివాస్ గురువారం నాడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇరువురు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సూచనలు చేశారు. పార్టీ ఫిరాయింపుల పైన కూడా స్పందించారు.
ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి వెళ్లడం నిజంగా బాధాకరమే అన్నారు. పార్టీ ఫిరాయింపులకు తాను మొదటి నుంచి వ్యతిరేకమని చెప్పారు. పార్టీ ఫిరాయింపుల చట్టంలోనే లోపం ఉందని డి శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు.
1990 నుంచే తెలంగాణ పైన వివక్ష కొనసాగుతోందని ఆయన చెప్పారు. తాను కేబినెట్ పదవిని కోరుకోవడం లేదని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎన్నో ప్రాజెక్టులు చేపట్టామన్నారు. అందులో మంచి, చెడులు ఉన్నాయని చెప్పారు.
ప్రస్తుతం ప్రాజెక్టు డిజైన్ మారిస్తే, అందులో మంచి ఉందా లేదా అనేది మాత్రమే చూడాలన్నారు. తెలంగాణ వాళ్లు ఉదయం లేచే మార్పులు ఏమైనా చంద్రబాబు తెచ్చారా అని ఎద్దేవా చేశారు. ఇద్దరు ముఖ్యమంత్రులు పరస్పరం సహకారంతో అభివృద్ధిపై దృష్టి సారించాలన్నారు.

తెలంగాణ సిఎం కెసిఆర్ తనను అభినందించారని చెప్పారు. నిన్న (బుధవారం) కెసిఆర్‌తో మాట్లాడిన తర్వాత ఆయన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారని, ఏవిధంగా చేస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందో ఆయా రంగాలపై ఆయనకు మంచి ఆలోచనలు ఉన్నాయన్నారు.
వాటిని ఇంప్లిమెంట్ చేసి సాధిస్తారనే నమ్మంక ఉందని చెప్పారు. ప్రతిపక్షాల్లో పాజిటివ్ దృక్పథం లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పదేళ్లలో దేశంలోనే టాప్ రాష్ట్రాల్లో తెలంగాణ ఉంటుందన్నారు. కెసిఆర్‌తో మాట్లాడాక నా ఆత్మ విశ్వాసం మరింత పెరిగిందన్నారు. తెలంగాణ ఎలా నష్టపోయిందో చర్చించామన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరడాన్ని తాను వ్యతిరేకించానని చెప్పారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రాజీనామా వ్యవహారంపై వ్యాఖ్యానించేందుకు నిరాకరించారు. అయితే, ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీలో చేరడం బాధాకరమే అని చెప్పడం గమనార్హం.












Click it and Unblock the Notifications