దానం లెక్కే వేరు, నాడు టీడీపీలో గెలిచి వెంటనే - పలు పార్టీలు మారి.. ఇలా..!!
దానం నాగేందర్. ఇప్పుడు రాజకీయంగా అందరూ చర్చిస్తున్న పేరు. హైకోర్టు అనర్హత వేటు తో వార్తల్లో నిలిచారు. దానం రాజకీయ ప్రస్థానం విభిన్నం. కాంగ్రెస్ నుంచి ప్రారంభమైన ఆయన రాజకీయం అనేక మలుపులు తిరిగింది. పలు పార్టీలు మారారు. రాజీనామాలు.. ఎన్నికలు దానం కు కొత్త కాదు. హైదరాబాద్ నగర రాజకీయాల్లో ప్రత్యేక ముద్ర వేసారు. ఇప్పుడు అనర్హత వేటు తో తిరిగి ఖైరతాబాద్ ఉప ఎన్నిక రావటంటో దానం అడుగులు ఆసక్తిగా మారుతున్నాయి.
దానం నాగేందర్ మూడు దశాబ్దాల రాజకీయ జీవితంలో ఎన్నో మలుపులు ఉన్నాయి. కాంగ్రెస్ నుంచి పలు పార్టీలు మారుతూ ఆసిఫ్ నగర్ నుంచి ఖైరతాబాద్ వరకు సాగింది. కాంగ్రెస్ నుంచి టీడీపీ, బీఆర్‌ఎస్ లో చేరిన ఆయన ఇప్పుడు తిరిగి సొంత గూటికి రావడంతో ఎమ్మెల్యే పదవి కోల్పోయారు. దానం నాగేందర్ 1994లో ఆసిఫ్ నగర్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎంఐఎం పార్టీ అభ్యర్థిని ఓడించి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. 1999లోనూ కాంగ్రెస్ తరఫున బరిలో నిలిచి విజయం సాధించారు. 2004లోనూ ఆసిఫ్‌నగర్ ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ శాసనసభ్యుడిగా రికార్డు సృష్టించినా.. ఆ దఫా మార్టీ మారారు. 2004లో అసెంబ్లీ టికెట్ నిరాకరించిన కాంగ్రెస్ పార్టీ.. సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి పోటీ చేయాలని సూచించింది. ఈ సూచనతో విభేదించిన నాగేందర్ నామినేషన్ దాఖలు చేయాల్సిన ఆఖరిరోజు టీడీపీలో చేరారు. ఆ పార్టీ బీ-ఫారంతో పోటీ చేసి విజయం సాధించారు. 2004లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో.. దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి సన్నిహితుడిగా పేరున్న దానం తిరిగి హస్తం గూటికి చేరారు. ఈ క్రమంలో టీడీపీ పార్టీ, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.

ఖైరతాబాద్ ఉప ఎన్నిక వేళ
ఆ తరువాత కొంత కాలానికి జరిగిన ఉప ఎన్నికల్లో ఓడిపోయారు. నియోజకవర్గాల పునర్విభజనతో ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి 2009లో దానం పోటీ చేసి గెలిచారు. అనంతరం 2009-14 వరకు మంత్రిగా కొనసాగారు. 2014లో కాంగ్రెస్ తరఫున అదే నియోజకవర్గం నుంచి బరిలో నిలవగా.. బీజేపీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి చేతిలో పరాజితులయ్యారు. తెలంగాణ ఏర్పాటు అనంతరం జరిగిన మొదటి ఎన్నికల్లో ఓటమి తర్వాత నాగేందర్ కొన్నాళ్లు మౌనంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లోనూ అంత చురుకుగా పాల్గొనలేదు. 2018 జూన్‌లో దానం బీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. అదే ఏడాది డిసెంబరులో జరిగిన ముందస్తు ఎన్నికల్లో ఖైరతా బాద్ ఎమ్మెల్యేగా గులాబీ పార్టీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 2023లోనూ బీఆర్‌ఎస్ తరఫున విజయం సాధించారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో తిరిగి ఆ పార్టీలో చేరారు. ఎంపీ గా సికింద్రాబాద్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ పోటీ చేయటమే ఇప్పుడు ఎమ్మెల్యే పదవి పోవటానికి ప్రధాన కారణంగా నిలిచింది. ఇప్పుడు ఖైరతాబాద్ ఉప ఎన్నికలో దానం కు సీటు.. పోటీ అంశం వేళ రాజకీయంగా ఆసక్తి కొనసాగుతోంది.













Click it and Unblock the Notifications
