కవిత జ్యడీషియల్ కస్టడీపై కోర్టు తాజా ఆదేశాలు
Kalvakuntla Kavitha: దేశవ్యాప్తంగా ప్రకంపనలు పుట్టించిన ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన భారత్ రాష్ట్ర సమితి శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవితకు ఊరట లభించలేదు. మరి కొన్ని రోజుల పాటు ఆమె జ్యుడీషియల్ కస్టడీలో కొనసాగనున్నారు.
ఇదివరకు ఢిల్లీ రోస్ అవెన్యూ న్యాయస్థానం విధించిన జ్యుడీషియల్ కస్టడీ నేటితో ముగిసింది. ఈ నేపథ్యంలో కవితను ఈడీ అధికారులు న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టారు. కస్టడీ గడువు పొడిగించాలంటూ అభ్యర్థించారు. 14 రోజుల పాటు కస్టడీ కావాల్సి ఉంటుందంటూ పిటీషన్ దాఖలు చేశారు.

ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవిత మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు సాక్ష్యాధారాలను సేకరిస్తోన్నామని, ఆమె నుంచి మరింత సమాచారాన్ని రాబట్టుకోవాల్సి ఉందని న్యాయస్థానానికి వివరించారు. ఇదే కేసులో సీబీఐ సైతం కవిత కస్టడీని కోరుతూ పిటీషన్ దాఖలు చేసిందని ఈడీ తరఫు న్యాయవాది గుర్తు చేశారు. దీన్ని బట్టి చూస్తే ఈ కేసు తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చని పేర్కొన్నారు.
సమాజంలో పలుకుబడి ఉన్న నాయకురాలు కావడం వల్ల కవితకు బెయిల్ మంజూరు చేస్తే- సాక్ష్యులను ప్రభావితం చేయగలరని ఈడీ తరఫు న్యాయవాది వాదించారు. సాక్ష్యాధారాలను ట్యాంపర్ చేసే అవకాశాలు లేకపోలేదని చెప్పారు. అందుకే మరో 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీ కావాలని కోరారు.
వాదనలను ఆలకించిన అనంతరం రోస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తులు ఈడీ తరఫు న్యాయవాది చేసిన వాదనలతో ఏకీభవించారు. కవిత జ్యుడీషియల్ కస్టడీని పొడిగించారు. ఈ నెల 23వ తేదీ వరకు కస్టడీని తరలించాలని ఆదేశించారు. అనంతరం అధికారులు ఆమెను తీహార్ జైలుకు తరలించారు.
జైలుకు తరలించే సమయంలో కోర్టు ఆవరణలో కవిత విలేకరులతో మాట్లాడటానికి ప్రయత్నించారు. తనపై నమోదు చేసిన కేసు, అందులో పొందుపరిచిన స్టేట్‌మెంట్లన్నీ కూడా పూర్తిగా రాజకీయపరమైనవిగా అభివర్ణించారు. ప్రతిపక్ష పార్టీలపై రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగమని పేర్కొన్నారు. సీబీఐ ఇప్పటికే జైల్లో తన వాంగ్మూలాన్ని నమోదు చేసిందని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications