కవిత కస్టడీ పొడిగింపుపై సస్పెన్స్
Kalvakuntla Kavitha: దేశవ్యాప్తంగా ప్రకంపనలు పుట్టించిన ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన భారత్ రాష్ట్ర సమితి శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత నేడు మరోసారి న్యాయస్థానం ముందుకు రానున్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఆమెను కోర్టు ముందు హాజరుపర్చనున్నారు.
ఢిల్లీ రోస్ అవెన్యూ న్యాయస్థానం ఇదివరకు విధించిన రిమాండ్ నేటితో ముగిసింది. ఈ నెల 9వ తేదీ వరకు ఆమెను ఈడీ అధికారుల కస్టడీకి తరలిస్తూ కిందటి నెల 26వ తేదీన రోస్ అవెన్యూ న్యాయస్థానం ఆదేశాలను జారీ చేసిన విషయం తెలిసిందే. కస్టడీ ముగిసిన నేపథ్యంలో ఈడీ అధికారులు ఆమెను న్యాయస్థానం సమక్షానికి తీసుకుని రానున్నారు.

కస్టడీని పొడిగించాలంటూ పిటీషన్ దాఖలు చేయనున్నారు. మరో 10 రోజుల పాటు కస్టడీ పొడిగించాలంటూ వారు న్యాయస్థానాన్ని అభ్యర్థించే అవకాశం ఉంది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన కవిత ప్రస్తుతం తీహార్ జైలులో ఈడీ అధికారుల కస్టడీలో ఉన్నారు.
మనీ ల్యాండరింగ్ వ్యవహారంలో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోందని, మరింత సమాచారాన్ని కవిత నుంచి రాబట్టుకోవాల్సి ఉందంటూ ఈడీ తరఫు న్యాయవాది పిటీషన్ దాఖలు చేస్తారని తెలుస్తోంది. దీనిపై వాదనల అనంతరం న్యాయస్థానం ఎలాంటి ఆదేశాలు ఇస్తుందనేది సస్పెన్స్‌గా మారింది.
ఇదివరకే కవిత దాఖలు చేసుకున్న మధ్యంతర బెయిల్ పిటీషన్‌ను రోస్ అవెన్యూ కోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. తన కుమారుడి పరీక్షలు ఉన్నాయని, తల్లిగా తోడుగా నిలవాల్సిన అవసరం ఉందంటూ ఆమె మధ్యంతర బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేయగా.. దాన్ని స్వీకరించిన కోర్టు విచారణ అనంతరం కొట్టివేసింది.












Click it and Unblock the Notifications