సీబీఐ, ఈడీ కేసుల్లో కవిత బెయిల్‌పై నిర్ణయం తీసుకున్న హైకోర్టు
K Kavitha: దేశవ్యాప్తంగా సంచలన సృష్టించిన ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన భారత్ రాష్ట్ర సమితి శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత.. బెయిల్ పిటీషన్లపై నెలకొన్న ఉత్కంఠత కొనసాగుతోంది. వీటిపై విచారణను ముగించిన ఢిల్లీ హైకోర్టు.. తన తీర్పును రిజర్వ్ చేసింది.
ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో మనీలాండరింగ్‌కు పాల్పడిన ఆరోపణలను ఎదుర్కొంటోన్నారు కవిత. 100 కోట్ల రూపాయల మొత్తాన్ని ఆమ్ ఆద్మీ పార్ట నాయకులకు చెల్లించినట్లు ఆమెపై ఫిర్యాదులు అందాయి. ఇప్పటికే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, సీబీఐ అధికారులు ఆమెను అరెస్ట్ చేశారు. మార్చి 15వ తేదీన ఈడీ, ఏప్రిల్ 11వ తేదీన సీబీఐ అధికారులు కవితను అరెస్ట్ చేశారు.

ఈ రెండు కేసుల్లో ఆమె జ్యుడీషియల్ కస్టడీలో కొనసాగుతున్నారు. తీహార్ జైలులో ఉంటూ విచారణను ఎదుర్కొంటోన్నారు. బెయిల్ కోసం కవిత దాఖలు చేసుకున్న పిటీషన్లపై ఈ నెల 6వ తేదీన రోస్ అవెన్యూ న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఆమెకు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. ఈ మేరకు రోస్ అవెన్యూ న్యాయస్థానం ప్రత్యేక న్యాయమూర్తి జస్టిస్ కావేరి బవేజా తీర్పు ఇచ్చారు.
దీన్ని ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేశారు కవిత. అప్పీల్ పిటీషన్లను దాఖలు వేశారు. కవిత తరఫున ప్రముఖ న్యాయవాదులు మోహిత్ రావు, దీపక్ నగర్ ఈ పిటీషన్లను దాఖలు చేశారు. వాటిని విచారణకు స్వీకరించింది ఢిల్లీ హైకోర్టు. న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణ కాంత శర్మ బెంచ్.. విచారణ చేపట్టింది.
పీఎంఎల్ఏలోని సెక్షన్ 19 ప్రకారం తనను అరెస్టు చేయడం అక్రమం అని, 100 కోట్ల రూపాయలను ఆప్ నేతలకు చెల్లించినట్లు ఎలాంటి సాక్ష్యాధారాలను కూడా సంపాదించలేకపోయారని, ఆ నగదును కూడా రికవర్ చేయలేకపోయారని అన్నారు. తనను అరెస్ట్ చేయడానికి ఇదొక కారణంగా చూపించారని కవిత తరఫు న్యాయవాది చెప్పారు.
విచారణ సందర్భంగా కవిత దాఖలు చేసిన పిటిషన్లపై తమ అభిప్రాయాలను తెలియజేయాలంటూ ఈడీ, సీబీఐకి నోటీసులు జారీ చేసింది జస్టిస్ స్వర్ణ కాంత శర్మ బెంచ్. హైకోర్టు ఆదేశాల మేరకు తమ వాదనలను వినిపించారు ఈడీ, సీబీఐ తరఫు న్యాయవాదులు. కవితకు బెయిల్ ఇస్తే- సాక్ష్యులను ప్రభావితం చేయగలరని, సాక్ష్యాధారాలను తారుమారు చేయొచ్చని అభిప్రాయపడ్డారు.
మనీలాండరింగ్ వంటి ఆర్థిక నేరాలకు కవిత పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నందున బెయిల్ ఇవ్వడం సరికాదని పేర్కొన్నారు. బెయిల్ పిటీషన్లను తాము వ్యతిరేకిస్తోన్నట్లు సీబీఐ, ఈడీ తరఫు న్యాయవాదులు న్యాయస్థానానికి తేల్చి చెప్పారు. కవిత పాత్ర ఉందంటూ వివరణాత్మక వాదనలను న్యాయస్థానానికి సమర్పించారు. ఆమె కస్టడీ కొనసాగించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇరు వర్గాల వాదనలను ఆలకించిన అనంతరం జస్టిస్ స్వర్ణ కాంత శర్మ తన తీర్పును రిజర్వ్ చేశారు.












Click it and Unblock the Notifications