లంచం... ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ డిప్యూటీ తహశీల్దార్... సంబరాలు చేసుకున్న జనం...
ఖమ్మం జిల్లాలో ఓ అవినీతి తహశీల్దార్‌ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పక్కా సమాచారంతో వేంసూర్ తహశీల్దార్ కార్యాలయంపై అవినీతి నిరోధకశాఖ అధికారులు బుధవారం(మార్చి 24) దాడులు నిర్వహించారు. ఓ రైతు నుంచి రూ.1లక్ష లంచం తీసుకుంటున్న డిప్యూటీ తహసీల్దార్ ఉపేందర్, సర్వేయర్ గుర్వేశ్‌లను అరెస్ట్ చేశారు.
వివరాల్లోకి వెళ్తే... సత్తుపల్లికి చెందిన తోట సాంబశివరావు అనే రైతుకు వేంసూర్ మండలంలో 25 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. దీనికి సంబంధించిన సర్వే నిమిత్తం ఇటీవల ఆయన మీ సేవలో దరఖాస్తు చేసుకున్నారు. అయితే సర్వే చేయాలంటే రూ.2 లక్షలు లంచం ఇవ్వాల్సిందేనని వేంసూర్ డిప్యూటీ తహసీల్దార్ ఉపేందర్,సర్వేయర్ గుర్వేశ్‌లు డిమాండ్ చేశారు. అంత డబ్బు తాను చెల్లించుకోలేనని చెప్పినా వినిపించుకోలేదు. చివరకు రూ..1.50లక్షలకు డీల్ కుదిరింది.

ఈ వ్యవహారంపై తోట సత్యనారాయణ అనే రైతు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. వివరాలన్నీ వారికి చేరవేశాడు. దీంతో బుధవారం తహశీల్దార్ కార్యాలయంలపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. లంచం తీసుకుంటుండగా డిప్యూటీ తహసీల్దార్ ఉపేందర్,సర్వేయర్ గుర్వేశ్‌లను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వారిని అదుపులోకి తీసుకుని కోర్టుకు తరలించినట్లు తెలుస్తోంది.
మరోవైపు ఈ వార్త తెలిసి స్థానిక జనం సంబరాలు జరుపుకున్నారు. అవినీతి అధికారికి తగిన శాస్తి జరిగిందని తహశీల్దార్ కార్యాలయం ముందు బాణసంచా పేల్చి సంతోషం వ్యక్తం చేశారు. ఈ ఏడాది జనవరిలో వికారాబాద్ జిల్లా దోమ మండలంలోనూ అవినీతి లంచాధికారిని ఏసీబీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. తహశీల్దార్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ ప్రేమ్ కుమార్ మూడెకెరాల భూమి సర్వే కోసం భాగ్యవతి అనే మహిళ నుంచి రూ.10వేలు లంచం తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు.
కాగా,గతంలోనూ రెవెన్యూ శాఖలో ఎంతోమంది అధికారులు లంచం తీసుకుంటూ పట్టుబడిన సంగతి తెలిసిందే. అధికారుల వేధింపులు భరించలేక ఆత్మహత్యలకు యత్నించినవారు కొందరైతే... తిరగబడి దాడులకు పాల్పడినవారు మరికొందరు. రెవెన్యూ శాఖలో అవినీతిని అంతం చేసేందుకు గతేడాది ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టాన్ని అమలులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. త్వరలోనే డిజిటల్ సర్వేకి కూడా ప్రభుత్వం సిద్దమవుతోంది.












Click it and Unblock the Notifications