17-20 వరకు మేడారం జాతర: కోటిన్నర భక్తులు వచ్చే అవకాశం, హెలికాప్టర్ సౌకర్యం
హైదరాబాద్: వరంగల్ జిల్లా మేడారంలో ఫిబ్రవరి 17 నుంచి 20 వరకు సమ్మక్కసారలమ్మ జాతరను భారీఎత్తున నిర్వహించనున్నట్లు ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, చందూలాల్ తెలిపారు. ఆసియాలో అతిపెద్దదైన గిరిజన జాతరగా ఇది పేరొందిందని, ఈసారి రికార్డుస్థాయిలో 1.50కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామని చెప్పారు.
ఈ జాతరను తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించి, రూ.154కోట్లతో ఏర్పాట్లు చేస్తోందని తెలిపారు. బుధవారం సచివాలయంలో వారు సమ్మక్కసారలమ్మ జాతర పోస్టర్లు, ఆహ్వాన పత్రికలను విడుదల చేశారు. ప్రభుత్వ సలహాదారు రమణాచారి, దేవాదాయ కమిషనర్ శివశంకర్, ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ పిడమర్తి రవి, సమ్మక్కసారలమ్మ పూజారులు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ.. మేడారం జాతరకు తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు భారీ ఎత్తున వస్తారని చెప్పారు. భక్తుల కోసం రహదారుల నిర్మాణంతోపాటు స్నానగదులు, మరుగుదొడ్లు, దుస్తులు మార్చుకునే గదులు తదితర వసతులు కల్పిస్తున్నామన్నారు. ప్రభుత్వం చేపట్టిన పనులన్నీ ఫిబ్రవరి మొదటివారంలో పూర్తవుతాయని, మంత్రులతో కలిసి తాను ఈ పనులను పరిశీలిస్తామని చెప్పారు.
జాతరలో ఎలాంటి సమస్యలు రాకుండా 200 సీసీ కెమేరాలతో నిరంతర పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు. వాహన రద్దీ దృష్ట్యా మేడారం వెళ్లేందుకు పస్రా నుంచి నార్లాపూర్ మీదుగా, తాడ్వాయి మీదుగా వెళ్లే రహదారులను రెండు వరుసలకు విస్తరించామన్నారు.

మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు జాతరకు గతంలో ఎప్పుడూ లేనివిధంగా విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. 6నెలల ముందే పనులు ప్రారంభించామని, యుద్ధప్రాతిపదికన వాటిని పూర్తిచేస్తున్నామని చెప్పారు.

భక్తుల కోసం హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ సదుపాయం కల్పిస్తున్నామని తెలిపారు. గిరిజన సంక్షేమశాఖ మంత్రి చందూలాల్ మాట్లాడుతూ.. భక్తులకు ఎలాంటిలోటు రాకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటోందని తెలిపారు. ఆసియాలోనే అతిపెద్దదైన జాతరకు గిరిజన, టూరిజంశాఖల తరఫున ఏర్పాట్లు చేశామని చెప్పారు.












Click it and Unblock the Notifications