ఐటీ ఉచ్చులో దిల్ రాజు- దెబ్బ కొట్టిన మెగా: బిగ్ ట్రబుల్
Dil Raju: ప్రముఖ నిర్మాత, తెలంగాణ చలన చిత్ర అభివృద్ధి సమాఖ్య అభివృద్ధి సంస్థ ఛైర్మన్ దిల్ రాజు ఆదాయపు పన్ను అధికారుల విచారణను ఎదుర్కొంటోన్నారు. కిందటి నెల తన నివాసంలో చోటు చేసుకున్న దాడులు, సోదాల నేపథ్యంలో కొద్దిసేపటి కిందటే హైదరాబాద్‌లోని ఐటీ కార్యాలయానికి చేరుకున్నారు. విచారణకు హాజరయ్యారు.
కిందటి నెలలో దిల్ రాజు నివాసాలు, కార్యాలయాలపై నాలుగు రోజుల పాటు ఐటీ దాడులు కొనసాగిన విషయం తెలిసిందే. ఆయన నిర్మించిన రెండు భారీ బడ్జెట్ సినిమాలు- గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం మూడు రోజుల వ్యవధిలో విడుదల కావడం, అదే స్థాయిలో కలెక్షన్లను రాబట్టుకున్నాయంటూ ప్రకటనలు ఇవ్వడం ఈ దాడులకు కారణం అయ్యాయి.

ఈ దాడుల సమయంలో గుర్తించిన కొన్ని కీలక డాక్యుమెంట్లు, ఆర్థికపరమైన లావాదేవీల గురించి ప్రశ్నించడానికి తాజాగా తమ కార్యాలయానికి పిలిపించుకున్నారు ఐటీ అధికారులు. దిల్ రాజు, ఆయన కుటుంబ సభ్యులకు చెందిన స్థిర- చరాస్తుల క్రయవిక్రయాలపై నిర్వహించిన పంచనామా గురించి ఆరా తీయనున్నారు.
తనిఖీల సందర్భంగా సీజ్ చేసినట్లుగా చెబుతోన్న అకౌంట్ బుక్స్‌లో పొందుపరిచిన వివరాలపై ఈ విచారణ సందర్భంగా ఐటీ ఆధికారులు దిల్ రాజును ప్రశ్నించే అవకాశం ఉంది. ప్రత్యేకించి- భారీ బడ్జెట్ సినిమాలకు ఎక్కడి నుంచైనా ఫైనాన్స్ తీసుకున్నారా?, ఆ ఫైనాన్షియర్లు ఎవరు? అనే విషయాల గురించి కూడా ఆరా తీస్తారని తెలుస్తోంది.
తన నివాసంపై జరిగిన ఐటీ దాడుల గురించి దిల్ రాజు ఇదివరకే వివరణ కూడా ఇచ్చిన విషయం తెలిసిందే. దాడుల సమయంలో ఇంట్లో 20 లక్షల రూపాయల లోపు మాత్రమే నగదు మొత్తం ఉందని, స్థిర- చరాస్తులపై పంచనామా నిర్వహించారని వెల్లడించారు. దీనికి సంబంధించిన డాక్యుమెంట్లను తన చేతికి అందజేశారని అన్నారు. వాటిని ఈ విలేకరుల సమావేశంలో చూపించారు.
ఈ అయిదు సంవత్సరాల కాలంలో తాము ఎలాంటి ఆస్తులను కొనుగోలు చేయలేదని వివరించారు. డాక్యుమెంట్ల పరిశీలన సందర్భంగా ఐటీ అధికారులు ఈ విషయాన్ని నిర్ధారించుకున్నారని దిల్ రాజు పేర్కొన్నారు. సంబంధిత శాఖ వద్దకు వెళ్లి తమ అనుమానాలను నివృత్తి చేసుకున్నారంటూ అప్పట్లో చెప్పారు దిల్ రాజు.












Click it and Unblock the Notifications