ప్రాణాలిస్తా: అరుణ, రేవంత్ నిజస్వరూపం తెల్సింది: శంకర్, ప్రభుత్వానికి సుప్రీం నోటీస్
హైదరాబాద్/మహబూబ్ నగర్: గద్వాలను జిల్లాగా ఏర్పాటు చేయాలని, ఇందుకో కోసం తాను ప్రాణాలు అర్పించేందుకు కూడా సిద్ధమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి డికె అరుణ సోమవారం నాడు వ్యాఖ్యానించారు.
రాయచూర్ నుంచి వేరుపడటం వల్ల గద్వాల నియోజకవర్గం ఎంతో నష్టపోయిందన్నారు. మల్లీ అలాంటి పొరపాటు చేయవద్దని ఆమె తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గద్వాల జిల్లా కోసం ప్రాణత్యాగానికి కూడా వెనుకాడేది లేదని హెచ్చరించారు.
గద్వాలకు అన్ని అర్హతలున్నాయన్నారు. గద్వాల ప్రాంత ప్రజలు ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నారని చెప్పారు. తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు పరిశీలనకు ప్రభుత్వం కమిటీ వేయబోతున్న నేపథ్యంలో ఆమె ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిశారు.

కెసిఆర్ పైన నాగం నిప్పులు
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన బీజేపీ నేత, తెలంగాణ బచావత్ నాగం జనార్దన్ రెడ్డి సోమవారం తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే, కేసీఆర్ మాత్రం చైనాలో విహారయాత్రలు చేస్తున్నారన్నారు.
కెసిఆర్ చైనా పర్యటనతో రైతులకు ఏం లాభమో చెప్పాలని నిలదీశారు. తన ఫాంహౌస్ ముందు, వెనుక రైతు ఆత్మహత్యలు జరుగుతున్నా కేసీఆర్ ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. అలాంటి కేసీఆర్‌కు రైతునని చెప్పుకునే అర్హత లేదన్నారు.
రైతు ఆత్మహత్యలపై టీఆర్ఎస్ ప్రభుత్వం నాటకాలు ఆడుతోందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని కరవు మండలాలను ప్రకటించి ఉంటే, కేంద్రం నుంచి సాయం వచ్చి ఉండేదన్నారు., కేసీఆర్ ప్రభుత్వం ఈ పని కూడా చేయలేకపోయిందన్నారు.
కెసిఆర్‌ను విమర్శించే హక్కు లేదు: రేవంత్ రెడ్డిపై శంకర్
టిడిపి కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి కెసిఆర్‌ను విమర్శించే హక్కు లేదని మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ మండిపడ్డారు. జైలుకెళ్లి తర్వాత రేవంత్ నిజస్వరూపం ఏమిటో ప్రజలకు తెలిసిందన్నారు. ఓటుకు నోటు కేసులో జైలు జీవితం గడిపిన రేవంత్ తమ పార్టీ నేతలను విమర్శించడం విడ్డూరమన్నారు. రేవంత్ తీరు మార్చుకోకుంటే నాలుక కోస్తామని హెచ్చరించారు.
తెలంగాణ సర్కార్‌కు సుప్రీం నోటీసులు
బీసీల జాబితా నుంచి కొన్ని కులాల తొలగింపుపై తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. బీసీ కులాల జాబితాలో కొన్ని కులాలను తొలగింపు విషయమై మెడికల్ విద్యార్థి, కుల సంఘాలు సుప్రీం కోర్టుకు వెళ్లాయి. గతంలో బీసీ కులాల జాబితాలో కొన్ని కులాల తొలగింపును సమర్థించిన హైకోర్టు తీర్పుపై సుప్రీం స్టే విధించింది. కేసులో ఇంప్లీడ్ కావాలని ఎంసీఐని ఆదేశించింది. 18వ తేదీకి విచారణ వాయిదా పడింది.












Click it and Unblock the Notifications