సీటు కోసం ఇద్దరు మంత్రుల పంచాయితీ -డీకే మార్క్ ట్విస్ట్..!!
తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల పోరు ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల్లోనూ మెజార్టీ సీట్లు దక్కించుకోవాలని భావిస్తోంది. బీజేపీ సైతం మెజార్టీ సీట్లలో గెలుపే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. మాజీ సీఎం కేసీఆర్ బస్సు యాత్ర ద్వారా ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తున్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్ మరో మూడు స్థానాలకు ఎంపీ అభ్యర్దులను ప్రకటించాల్సి ఉంది. ఖమ్మం సీటు పంచాయితీ బెంగళూరుకు చేరింది.
ఖమ్మం సీటు పంపాయి
తెలంగాణలో కాంగ్రెస్ మూడు స్థానాల్లో అభ్యర్దులను ప్రకటించాల్సి ఉంది. అందులో కరీంనగర్ నుంచి వెలిచాల రాజేందర్, హైదరాబాద్ నుంచి సమీరుల్లాఖాన్ పేర్లు దాదాపు ఖరారయ్యాయి. ఖమ్మం నుంచి సీటు కోసం పోటీ నెలకొంది. కేబినెట్ లో కీలకంగా వ్యవహరిస్తున్న ఇద్దరు ఖమ్మం జిల్లా మంత్రులు తమ వారికి ఈ సీటు దక్కేలా మంత్రాంగం చేస్తున్నారు. పార్టీ నాయకత్వం పైన ఒత్తిడి చేస్తున్నారు. దీంతో.. ఈ పంచాయితీ బెంగుళూరు చేరింది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఖమ్మం సీటు విషయంలో చాలా పట్టుదలతో ఉన్నారు. తన సోదరుడు ప్రసాద్ రెడ్డికి సీటు కావాలని పట్టుబడుతున్నారు.

డీకే శివకుమార్ ఫార్ములా
అదే సమయంలో తన భార్య నందినికి కాకపోతే రాయల నాగేశ్వరరావుకు టికెట్ ఇవ్వాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పట్టుబడుతున్నారు. దీంతో ఈ పంచాయతీ కర్ణాటక డిప్యూటీ సీఎం, కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ వద్దకు పంచాయతీ చేరింది. ఎవరికి కేటాయిస్తే ఎవరితో తంటానోనని కాంగ్రెస్ పార్టీ ఈ టికెట్‌ను పెండింగ్‌లో పెడుతూ వస్తోంది. ఈ నెల 25తో నామినేషన్ల గడువు ముగియనుంది. సమయం సమీపిస్తుండటంతో ఇద్దరు మంత్రులు తమ వారికి సీటు ఇవ్వాలని కోరుతున్నారు. దీంతో..డీకే శివకుమార్ వద్ద పంచాయితీలో ఎవరికి సీటు వచ్చినా అందరూ కలిసి పని చేయాలని సూచించారు.

ఖమ్మం దక్కేదెవరికి
ఇదే సమయంలో ఇద్దరు సూచించిన వారికి కాకుండా కొత్త పేరు తెర మీదకు తెచ్చినట్లు సమాచారం. ఖమ్మం జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు మినహా అన్నీ కాంగ్రెస్ గెలుపొందింది. బీఆర్ఎస్ నుంచి గెలిచిన వెంకటరావు సైతం కాంగ్రెస్ లో చేరారు. దీంతో..ఎంపీ సీటు ఈ సారి ఖచ్చితంగా గెలుచుకోవాలని పార్టీ నాయకత్వం భావిస్తోంది. స్థానిక సమీకరణాల్లో భాగంగా అనూహ్యంగా సీనియర్ నేత మండవ వెంకటేశ్వర రావు పేరు తెర పైకి వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే ఆయనకు సీటు పైన చర్చ జరిగినా..పోటీ చేయలేదు. మండవను ఒప్పించి ఖమ్మం నుంచి బరిలోకి దింపే ప్రయత్నలు జరుగుతున్నాయి. దీంతో..చివరగా ఖమ్మం నుంచి ఎవరికి సీటు దక్కుతుందనేది ఆ సాయంత్రం స్పష్టత వచ్చే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications