పనిచేస్తున్న ఆస్పత్రి నిర్లక్ష్యం: కోమాలోకి డా. నిహారిక, నెల గడిచినా..
పని చేస్తున్న ఆస్పత్రిలోనే ఓ వైద్యురాలికి చేదు అనుభవం ఎదురైంది. సైనస్ సమస్య నివారణకు శస్త్రచికిత్స చేయమంటే వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించి ఆమె ప్రాణాల మీదకు తెచ్చారు.
హైదరాబాద్: పని చేస్తున్న ఆస్పత్రిలోనే ఓ వైద్యురాలికి చేదు అనుభవం ఎదురైంది. సైనస్ సమస్య నివారణకు శస్త్రచికిత్స చేయమంటే వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించి ఆమె ప్రాణాల మీదకు తెచ్చారు. శస్త్రచికిత్స చేసిన మరుసటి రోజే ఆమె కోమాలోకి పోయింది.

వైద్యురాలికి చికిత్సలోనే నిర్లక్ష్యం
ఈ క్రమంలో ఆమెకయ్యే ఖర్చులు తామే భరిస్తామని, వెంటనే వేరే ఆస్పత్రిలో చేర్పించాలని సూచించడంతో కుటుంబ సభ్యులు అలానే చేశారు. అయితే, నెలదాటినా కూడా ఆమె మామూలు మనిషికాకపోవడంతో కుటుంబసభ్యులు, బంధువులు సదరు ఆస్పత్రి ముందు బుధవారం ఆందోళనకు దిగారు. ఈ సంఘటన బేగంపేటలోని వివేకానంద ఆస్పత్రిలో చోటు చేసుకుంది. బాధితురాలు ఎవరో కాదు అదే ఆస్పత్రిలో వైద్యురాలిగా పనిచేస్తున్న డాక్టర్ నిహారిక.

వైద్యురాలిగా అదే ఆస్పత్రిలో చేరిన నిహారిక..
బాధితురాలి కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నిహారిక (27) హోమియోపతిలో కోర్సు ముగించుకుని మూడు నెలల కిందటే వివేకానంద ఆస్పత్రిలో ఉద్యోగంలో చేరారు. ఆమెకు సైనస్ సమస్య ఉండటంతో అదే ఆస్పత్రిలో ఈఎన్‌టీ వైద్యులు రామకృష్ణను సంప్రదించగా మత్తు వైద్యుడు (అనస్థీయిన్) డా. జగదీష్‌తో కలిసి సెప్టెంబరు 16న శస్త్రచికిత్స చేశారు.

మత్తు ఎక్కువగా ఇవ్వడంతో కోమాలోకి..
నిహారిక పరిస్థితి ఇబ్బందికరంగా మారడంతో మరుసటి రోజు కేర్ ఆస్పత్రికి తరలించాలని కుటుంబ సభ్యులకు సూచించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు.. సైనస్ శస్త్రచికిత్స చేసిన వివేకానంద ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం వల్ల నిహారిక మెదడు దెబ్బతిందని తెలిపారు. మత్తు అధికమోతాదులో ఇవ్వడం వల్లే ఇలా జరిగిందని తెలుస్తోందన్నారు.

నెల దాటినా కోమాలోనే నిహారిక..
ఈ విషయాన్నే వివేకానంద ఆస్పత్రి వైద్యుల దృష్టికి తీసుకెళ్లగా ‘ఎంత ఖర్చు అయినా అవసరమైతే అమెరికాకు తీసుకెళ్లి నయం చేయిస్తామని హామీ ఇచ్చారు. కేర్ ఆస్పత్రిలో రూ.5లక్షల రుసుమును వివేకానంద ఆస్పత్రి యాజమాన్యమే చెల్లించింది. అయితే, నెలన్నర చికిత్స తర్వాత ఆస్పత్రిలో కాకుండా ఇంట్లో ఉండి వైద్యం చేయించాలని నిర్ణయించి సన్‌సిటీలోని డా.నిహారిక నివాసానికి ఆమెను మార్చి వైద్యం అందిస్తూ వచ్చారు.

కుటుంబసభ్యుల ఆందోళన.. ఫిర్యాదు..
కాగా, ఇప్పుడేమో వారం రోజులుగా మందులూ ఇవ్వకుండా దాటవేస్తున్నారని బంధువులు తెలిపారు. బుధవారం కుటుంబ సభ్యులు, బంధువులతో ఆస్పత్రికి చేరుకుని ఆందోళన చేపట్టారు. వైద్యుల నిర్లక్ష్యంపై పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, వారి ఆరోపణల్లో వాస్తవం లేదని వివేకానంద ఆస్పత్రి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ తెలిపారు. కాగా, ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications