మోడీనే అలా చెప్పారు.. సీఎం రేవంత్
తెలంగాణలో బీసీ కులగణన సర్వేను సమగ్రంగా ఖచ్చితత్వంతో నిర్వహించామని, ఎలాంటి తప్పులు, పొరపాట్లు లేవని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కులగణన విషయంలో భవిష్యత్‌లో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. బీసీ కులగణన సర్వేపై అనుమానాల నివృత్తిపై ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
బీసీ కులగణన సర్వే చేపట్టడం ద్వారా తెలంగాణ కాంగ్రెస్ చారిత్రాత్మకమైన నిర్ణయాన్ని తీసుకుందని సీఎం రేవంత్ తెలిపారు. రాహుల్ గాంధీ మాట ఇచ్చిన తర్వాతే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌కు అధికారం ఇచ్చారన్నారు. రాహుల్ గాంధీ ఆశయం మేరకే సమగ్రమైన కులగణన చేపట్టామన్నారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని భాగస్వామ్యం చేస్తూ పూర్తి పారదర్శకంగా సర్వే చేపట్టామని సీఎం తెలిపారు. బీహార్, కర్ణాటక సహా వివిధ రాష్ట్రాల్లో అధ్యయనం చేశామన్నారు.

కులగణనలో మూడు రోజులపాటు ఇళ్ల వివరాలు సేకరించామని, ఇందుకోసం ప్రభుత్వంలోని 15 శాఖలకు చెందిన అధికారులను నియమించామని సీఎం తెలిపారు. మొత్తం 8 పేజీలతో ఇంటి యజమాని ఇచ్చిన సమాచారాన్ని సేకరించామన్నారు. 36 వేల మంది డేటా ఆపరేటర్లను అదనంగా నియమించామని తెలిపారు. ఎన్ రోలర్‌గా సమాచారం సేకరించినవారే డేటా ఎంట్రీ చేశారని చెప్పారు. దాదాపు కోటి 12 లక్షలకుపైగా కుటుంబాలు కులగణన సర్వేలో పాల్గొన్నాయని సీఎం రేవంత్ తెలిపారు.
కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వే తప్పుల తడక అని.. అందుకే సర్వే వివరాలు బయటపెట్టలేదని రేవంత్ ఆరోపించారు. కేసీఆర్ చెప్పిన కాకిలెక్కల ప్రకారం బీసీలు తగ్గారని.. ఓసీలు పెరిగారని అన్నారు. దేశమంతా కులగణన చేయాల్సి వస్తుందని బీజేపీ భయపడుతోందన్నారు.
కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు జనాభా లెక్కల్లో లేరని సీఎం రేవంత్ అన్నారు. ఇన్ని అవకాశాలు ఇచ్చినా.. వాళ్లు కులగణన సర్వేలో పాల్గొనలేదన్నారు. కులగణన సర్వేపై ప్రతిపక్షాల మాటలు నమ్మొద్దన్నారు. గుజరాత్‌లో కూడా ఓబీసీ ముస్లింలు ఉన్నారని ప్రధాని మోడీ చెప్పారని సీఎం రేవంత్ అన్నారు. ఇక్కడి బీజేపీ నేతలు మాత్రం ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బీసీల లెక్క తేలితే మాకేంటి.. అని ఆ వర్గం అడుగుతారని బీజేపీ, బీఆర్ఎస్ భయపడుతోందన్నారు.
దేశ వ్యాప్తంగా కులగణన చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడుతుందని సీఎం రేవంత్ అన్నారు. రాహుల్ గాంధీ ప్రధాని అయితే.. అన్ని రాష్ట్రాల్లో కులగణన జరిగితీరుతుందన్నారు. కులగణనను కాపాడుకోకపోతే బీసీలే నష్టపోతారని అన్నారు. తన బాధ్యతగా కులగణ సర్వేను సమగ్రంగా నిర్వహించామన్నారు. బీసీ జనాభా ప్రకారం వారికి అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం రేవంత్ వెల్లడించారు.












Click it and Unblock the Notifications