హైదరాబాద్ లో భారీ బీచ్?
సముద్రాన్ని చూడటానికి హైదరాబాదీలు ఏ సూర్యలంక బీచ్‌కో లేదా ఏ ఆర్ కే బీచ్ కో వళ్లనక్కర్లేదు. ఆ బీచే స్వయానా హైదరాబాద్ కు రాబోతోంది. అచ్చంగా సముద్రం, తీరంలో ఉండే వాతావరణాన్ని ప్రతిబింబించేలా ఓ భారీ సరస్సు ఇక్కడ నిర్మితం కాబోతోంది. ఇది మ్యాన్ మేడ్ బీచ్ గా రికార్డు నెలకొల్పబోతోంది.
హైదరాబాద్ శివార్లలోని కొత్వాల్ గూడలో కృత్రిమ సముద్రాన్ని నిర్మించడానికి అవసరమైన ప్రణాళికలను తెలంగాణ ప్రభుత్వం ఆమోదించినట్లు న్యూస్ 18 ఇంగ్లీష్ వెబ్ సైట్ వెల్లడించింది. దీనిపై ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ ఛైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి పేరును ఉటంకించింది.

కోత్వాల్ గూడలో దాదాపు 35 ఎకరాల విస్తీర్ణంలో ఈ మ్యాన్ మేడ్ బీచ్ ప్రాజెక్ట్ రూపుదాల్చనుంది. ఈ ప్రాజెక్ట్ వ్యయం అంచనా 225 కోట్ల రూపాయలు. పబ్లిక్-ప్రైవేట్ పార్ట్ నర్ షిప్ (పీపీపీ) విధానంలో దీన్ని అభివృద్ధి చేయనుంది తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ. ఈ ప్రాజెక్టు నిర్మాణం డిసెంబర్‌లో ప్రారంభం కావచ్చని అంచనాలు ఉన్నాయి.
బిగ్గెస్ట్ ఎంటర్టైన్మెంట్ సెంటర్, అడ్వెంచర్ స్పోర్ట్స్/వాటర్ స్పోర్ట్స్ రంగాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ ను ప్రతిపాదించినట్లు చెబుతున్నారు. ఫ్లోటింగ్ విల్లాలు, స్టార్-కేటగిరీ హోటళ్ల నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించినట్లు ఆ కథనం వెల్లడించింది.
అలాగే- బంగీ జంపింగ్, సెయిలింగ్, వాటర్ స్కేటింగ్, వింటర్/స్ప్రింగ్ స్పోర్ట్స్ వంటివి ఇక్కడ ఏర్పాటు కానున్నాయి. పార్కులు, సైక్లింగ్ ట్రాక్, చిన్నపాటి గ్రౌండ్స్, ఓపెన్ థియేటర్, ఫుడ్ కోర్టులు, ఫౌంటెన్లు, అత్యాధునిక వేవ్ పూల్ వంటివి ఈ ప్రాజెక్టులో చేర్చింది ప్రభుత్వం. నగరవాసులకు బీచ్ తరహా అనుభూతిని ఇవ్వడానికి అందుబాటులో ఓ వీకెండ్ గెట్ అవే గా దీన్ని డెవలప్ చేయనుంది.
ఈ బీచ్ నిర్మాణానికి అవసరమైన డీపీఆర్ ఇప్పటికే ఖరారైందని ఆ కథనం పేర్కొంది. ఈ రకంగా బీచ్ టూరిజాన్ని ఆకర్షించాలని ప్రభుత్వం భావిస్తోందనే అంచనాలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం కూడా లక్షలాదిమంది దేశీయ, విదేశీ పర్యాటకులు తెలంగాణను సందర్శిస్తోన్నారని, ఈ మ్యాన్ మేడ్ అందుబాటులోకి వస్తే వారి సంఖ్య మరింత పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
హైదరాబాద్ సహా, ఇతర జిల్లాల్లో గల వారసత్వ కట్టడాలు, ఎకో టూరిజం, నిజాం కాలాం నాటి కోటలను తిలకించడానికి పర్యాటకులు తెలంగాణకు వస్తుంటారు. అదే సమయంలో ఈ కృత్రిమ బీచ్ అందుబాటులోకి తీసుకుని వస్తే పర్యాటకుల సంఖ్య మరింత పెరుగుతుందని ప్రభుత్వం అభిప్రాయపడుతోంది.












Click it and Unblock the Notifications