వరంగల్ లోక్‌సభ బరిలో ఊహించని పేరు..!!
Dr Kadiyam Kavya: దేశంలో సార్వత్రిక ఎన్నికల కోలాహలం నెలకొంది. షెడ్యూల్ విడుదలకు ఎంతో సమయం లేదు. గడువు సమీపించింది. ఇంకో రెండు మూడు రోజుల్లో షెడ్యూల్ విడుదల కావడం ఖాయంగా కనిపిస్తోంది. దీనితో పాటే- దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వస్తుంది.
ఈ క్రమంలో అన్ని పార్టీలు కూడా అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తూ వస్తోన్నాయి. తెలంగాణలో కాంగ్రెస్, భారత్ రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీలు ఇప్పటికే దశలవారీగా తమ అభ్యర్థులను ఖరారు చేశాయి. నాలుగు చోట్ల కాంగ్రెస్, అయిదు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్, ఆరు స్థానాల్లో బీజేపీ అభ్యర్థుల పేర్లు వెల్లడయ్యాయి.

అదే సమయంలో బీఆర్ఎస్ మరో కీలక నియోజకవర్గానికి అభ్యర్థిని ఖరారు చేసింది. ఇప్పటికే మహబూబాబాద్- మలోత్ కవిత, కరీంనగర్- బీ వినోద్ కుమార్, పెద్దపల్లి- కొప్పుల ఈశ్వర్, ఖమ్మం- నామా నాగేశ్వరరావు, చేవెళ్ల- కాసాని జ్ఞానేశ్వర్‌లను బరిలోకి దించింది బీఆర్ఎస్.
తాజాగా- కీలకమైన వరంగల్ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిని వెల్లడించింది. డాక్టర్ కడియం కావ్య పేరును ప్రకటించింది. మాజీ మంత్రి కడియం శ్రీహరి కుమార్తె ఆమె. కాకతీయ మెడికల్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తోన్నారు. కావ్య పేరును బీఆర్ఎస్ అధినేత, ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ ఖరారు చేశారు.
గతంలో కడియం శ్రీహరి.. ఇదే వరంగల్ నుంచి లోక్‌సభకు ప్రాతినిథ్యాన్ని వహించిన విషయం తెలిసిందే. 2014 ఎన్నికల్లో ఆయన బీఆర్ఎస్ అభ్యర్థిగా ఇక్కడి నుంచి విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్‌కు చెందిన దొమ్మాటి సాంబయ్యను భారీ మెజారిటీతో ఓడించారు.
ఆ మరుసటి ఏడాదే లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అప్పుడు జరిగిన ఉప ఎన్నికలో బీఆర్ఎస్ నుంచి పసునూరి దయాకర్ గెలిచారు. 2019లోనూ ఆయనే గెలిచారిక్కడి నుంచి. ఈ సారి పసునూరి దయాకర్‌కు టికెట్ ఇవ్వలేదు కేసీఆర్. కడియం కావ్యను బరిలో దించారు.












Click it and Unblock the Notifications