Rainfall Deficit: రైతన్నలో టెన్షన్..టెన్షన్.. తెలుగు రాష్ట్రాలపై 'కరువు’ మేఘాలు!
Rainfall Deficit: తెలుగు రాష్ట్రాలపై ప్రస్తుతం 'కరువు' మేఘాలు అలుముకుంటున్నాయి. బ్రేక్ మాన్సూన్ తరహా వాతావరణం అన్నదాతలను కలవరపెడుతోంది. వర్షాకాలంలో అత్యంత కీలకమైన జులై నెల తీవ్ర నిరాశను మిగులుస్తోంది. ఇప్పటివరకు సాధారణం కంటే 10 శాతం తక్కువ వర్షపాతం నమోదైందని వాతావరణం నమోదైందని వాతావరణ నిపుణులు తెలిపారు. రాబోయే వారం పది రోజులు చాలా కీలకమని.. ఈ లోపు వర్షాలు కురవకపోతే ఇప్పటివరకు వేసిన పంటలు తీవ్రంగా దెబ్బతినే అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని హెచ్చరిస్తున్నారు. ఈ సంవత్సరం ఋతుపవనాలు 9 రోజులు ముందుగానే తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించినప్పటికీ.. రైతులకు చాలా అత్యవసరమైన సమయంలో మాత్రం కరువయ్యాయి. అల్పపీడనాలు ఏర్పడే సంఖ్య తగ్గడం కూడా నైరుతి ఋతుపవనాల ద్వారా రావాల్సిన వర్షపాతంలో ఈ లోటుకు ఒక ప్రధాన కారణంగా భావిస్తున్నారు.
ప్రస్తుత వాతావరణ పరిస్థితి ఇలా..
ప్రస్తుతం రాజస్థాన్ పరిసర ప్రాంతాల్లో ఒక వాయుగుండం కొనసాగుతోంది. మరోవైపు ఉత్తర ఝార్ఖండ్, దక్షిణ బీహార్‌ల పరిసరాల్లో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ఈ వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో బుధ, గురువారాల్లో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. తెలంగాణలో జులై 17, 18 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉండగా.. మరికొన్ని ప్రాంతాల్లో బలమైన ఉపరితల గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

ఏపీపై వాతావరణ ప్రభావం
ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, రాబోయే 3 రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అయితే, బుధ, గురువారాల్లో తేమ, ఉక్కపోత వాతావరణం కొనసాగే అవకాశముందని పేర్కొంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం రైతన్న వర్షాల కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు లేకపోవడంతో పత్తి పంట ఎండిపోవడం ప్రారంభించింది. వరి నాట్లు వేయడానికి సిద్ధంగా ఉన్న అన్నదాతలు వర్షం కోసం ఆశగా ఆకాశం వైపు చూస్తున్నారు. ఈ కీలక సమయంలో వర్షాలు కురవకపోతే వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.
ఆకాశం వైపు ఆశగా చూస్తున్న రైతన్నలు
వర్షాకాలం సీజన్ ప్రారంభం నాటి నుంచి ఇప్పటివరకు చిరుజల్లుల తప్ప భారీ వర్షాలు కురిసిన దాఖలాలు కూడా లేవు. కరువు మేఘాలు కమ్ముకోవడంతో రైతాంగం ఆందోళన చెందుతోంది. ఈ సీజన్ లో వర్షాలు కురవకపోవడంతో తగ్గిపోయిన బోర్లు కుదురుకోకపోగా.. అక్కడక్కడా పోస్తున్న బోర్లు కూడా ఎత్తిపోవడంతో ఇబ్బందికర పరిస్థితులు దాపురించాయి. రోజూ కమ్ముకొస్తున్న మేఘాలను చూసి రైతులు ఆశతో ఆకాశం వైపు చూడడం.. కాసేపటికే మేఘాలు మాయం కావడం అన్నదాతలను ఆవేదనకు గురిచేస్తోంది. మరో 10 రోజులు కూడా ఇదే పరిస్థితి ఉంటే వానాకాలం సాగు మీద ఆశలు వదిలేసుకోవాల్సిందేనని రైతులు వాపోతున్నారు.












Click it and Unblock the Notifications