హైదరాబాద్ కో లివింగ్ హాస్టల్స్ లో డ్రగ్స్ దందా.. ఐదుగురు అరెస్ట్..
హైదరాబాద్ మహానగరానికి నిత్యం వందల సంఖ్యలో విద్యార్థులు, ఉద్యోగులు వస్తుంటారు. భాగ్యనగరంలో పలు అంతర్జాతీయ టెక్ కంపెనీలతోపాటు విద్యా సంస్థలు, కోచింగ్ కేంద్రాలు ఉన్న నేపథ్యంలో ఇక్కడి హాస్టల్స్ లో ఉండేందుకు మొగ్గుచూపుతారు. అయితే ఇటీవలికాలంలో హైదరాబాద్ లో కో లివింగ్ హాస్టల్స్ ఎక్కువగా పుట్టుకొస్తున్నాయి. కో లివింగ్ హాస్టల్స్ లో అమ్మాయి.. అబ్బాయి కలిసే ఉంటారు. ఇలాంటి హాస్టల్స్ కు ఇప్పుడు హైదరాబాద్ లోని పలు ప్రాంతాలు అడ్డాగా మారాయి. ఈ క్రమంలో కో లివింగ్ హాస్టల్స్ లో డ్రగ్స్ దందా కూడా సాగుతున్నట్లు పోలీసులు గుర్తించారు.
హైదరాబాద్ లోని రాయదుర్గ్ ప్రాంతంలో ఉన్న పలు కో లివింగ్ హాస్టల్స్ లో డ్రగ్స్ దందా తాజాగా వెలుగులోకి వచ్చింది. రాయదుర్గ్ లోని కో లివింగ్ హాస్టల్స్ లో పెద్దఎత్తున డ్రగ్స్ దందా నడుస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. తాజాగా రాయదుర్గ్ లోని కో-లివ్ గార్నెట్ పీజీలో రాజేంద్రనగర్ SOT పోలీసులు దాడులు నిర్వహించారు. MDMA డ్రగ్ సరఫరా చేస్తున్న డ్రగ్ పెడ్లర్లు, ముగ్గురు వినియోగదారులను అరెస్ట్ చేశారు. వారి నుంచి 12 గ్రాముల MDMA, 7 గ్రాముల OG కుష్ గంజాయి, 6 మొబైల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.

ఇక డ్రగ్స్ సరఫరాదారులను ఏపీకి చెందిన డ్రగ్ పెడ్లర్లు వంశీ దిలీప్, బాలా ప్రకాశ్ గా గుర్తించారు. అలాగే వినియోగదారులను హైదరాబాద్ కు చెందిన మణికంఠ, రోహిత్, తరుణ్ గా SOT పోలీసులు గుర్తించారు. మరోవైపు రాయదుర్గ్ తో పాటుగా కో లివింగ్, పీజీ హాస్టల్స్ ను కేంద్రంగా చేసుకుని యువకులు, సాప్ట్ వేర్ ఉద్యోగులే లక్ష్యంగా డ్రగ్స్ సరఫరా జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు. అలాగే మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో కుప్పలుతెప్పలుగా కో లివింగ్ హాస్టల్స్ ను నిర్వహిస్తున్నట్లు పోలీసుల దృష్టికి వచ్చింది.












Click it and Unblock the Notifications