డ్రగ్స్ కేసు: చార్మిని విచారించిన ఈడీ, కీలక అంశాలపై ఆరా, ఆమె ఏమన్నారంటే?
హైదరాబాద్: డ్రగ్స్ కేసులో టాలీవుడ్ నటి, నిర్మాత చార్మి విచారణ గురువారం సాయంత్రం ముగిసింది. గురువారం ఉదయం 10.30 నుంచి సాయంత్రం 6.30 వరకు చార్మిని ఈడీ అధికారులు ప్రశ్నించారు. అనంతరం చార్మి మీడియాతో మాట్లాడుతూ.. ఈడీ అధికారులు కోరిన బ్యాంక్ డ్యాక్యుమెంట్స్ సమర్పించినట్లు తెలిపారు.
ఈడీ దర్యాప్తునకు పూర్తిగా సహకరించినట్లు తెలిపారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు తిరిగి ఎప్పుడు పిలిచినా దర్యాప్తునకు హాజరవుతానని చార్మి వెల్లడించారు. కాగా విచారణ సందర్భంగా చార్మికి సంబంధించిన రెండు బ్యాంక్ ఖాతాల లావాదేవీలను ఈడీ అధికారులు పరిశీలించారు. 2016లో కెల్విన్‌తో మాట్లాడిన కాల్ డేటా.. వాట్సాప్ ఛాట్‌ను ఛార్మీకి చూపిన అధికారులు.. దాదా పేరుతో ట్రాన్స్‌ఫర్ అయిన లక్షల రూపాయల లావాదేవీలపై ప్రశ్నించినట్లు తెలిసింది. అయితే కెల్విన్ ఎవరో తనకు తెలియదని ఛార్మీ ఈడీ అధికారులకు తెలిపినట్లు సమాచారం.

చట్ట ప్రకారం తాను ఇంతకు మించి ఎక్కువ మాట్లాడలేనని చెప్పారు ఛార్మి. డ్రగ్ పెడ్లర్ కెల్విన్ అప్రూవర్‌గా మారి ఇచ్చిన సమాచారంతో.. ఛార్మిని ప్రశ్నించారు. మనీ లాండరింగ్, ఫెమా నిబంధనల ఉల్లంఘనపై ఛార్మిని అడిగినట్టు సమాచారం అందుతోంది. కాగా, తదుపరి విచారణలో సెప్టెంబర్ 6న రకుల్ ప్రీత్ సింగ్ హాజరుకావాల్సి వుంది.
రెండ్రోజుల క్రితం పూరీ జగన్నాథ్‌ను సుదీర్ఘంగా విచారించిన ఈడీ
డ్రగ్స్ కేసు వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దర్యాప్తు ముమ్మరం చేసింది. మంగళవారం సినీ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ను సుమారు 10 గంటలపాటు విచారించింది. ఈ విచారణలు పలు కోణాల్లో పూరీకి ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది. మనీ లాండరింగ్ చట్టం కింద సినీరంగానికి చెందిన 12 మందికి ఇప్పటికే ఈడీ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మంగళవారం నుంచి విచారణ మొదలుపెట్టింది. మొదటగా పూరీ జగన్నాథ్ హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయానికి మంగళవారం ఉదయం వెళ్లారు. ఆయనతోపాటు తన చార్టెడ్ అకౌంటెంట్(పీఏ) శ్రీధర్‌ని కూడా ఈడీ అధికారులు పలు అంశాలపై విచారించారు.
ఉదయం 10.17 గంటల నుంచి రాత్రి 7.45 వరకు ఈ విచారణ కొనసాగింది. సుదీర్ఘంగా సాగిన ఈ విచారణలో ఈడీ అధికారులు అడిగిన పలు ప్రశ్నలకు పూరీ జగన్నాథ్ సమాధానం చెప్పినట్లు తెలుస్తోంది. పూరీని, అతని సీఏను విడివిడిగా ప్రశ్నించారు. పూరీ బ్యాంకు లావాదేవీలపై పూర్తిగా ఈడీ ఆరదీసింది. పూరీకి చెందిన 3 బ్యాంకు అకౌంట్ల నుంచి సమాచారం సేకరించింది. 2015 నుంచి 2017 వరకు జరిగిన లావాదేవీలపై ఈడీ అధికారులు దృష్టి సారించినట్లు సమాచారం.
బ్యాంకు లావాదేవీలతోపాటు ఇతర ఆర్థిక విషయాలను ఈడీ అధికారులు అడిగినప్పుడు చార్టెడ్ అకౌంటెంట్ సాయంతో పూరీ జగన్నాథ్ సమాధానం ఇచ్చినట్లు తెలిసింది. కాగా,
2017లో నమోదైన డ్రగ్స్ కేసు ఆధారంగా చేపట్టిన సినీ ప్రముఖుల విచారణ సెప్టెంబర్ 22 వరకు కొనసాగనుంది.
డ్రగ్స్ కేసుతో సంబంధం లేదంటూ బండ్ల గణేష్
పూరీ జగన్నాథ్‌ను ఈడీ విచారిస్తున్న సమయంలో సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ ఈడీ కార్యాలయానికి రావడం గమనార్హం. అయితే, తాను పూరీ జగన్నాథ్‌ను కలిసేందుకు వచ్చానని, తనకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. పూరి జగన్నాథ్ తిరిగి రావడం ఆలస్యం కావడంతోనే తాను ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు. అమ్మతోడు తనకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని గణేష్ చెప్పారు.
Recommended Video
కాగా, డ్రగ్స్ సరఫరాదారులకు, కొంతమంది సినీ సెలబ్రిటీలకు మధ్య నగదు లావాదేవీలు జరిగినట్లు ఇప్పటికే ఈడీ అధికారులు ప్రాథమిక ఆధారాలు సేకరించారు. జులై 2017లో మత్తు మందుల సరఫరాదారు కెల్విన్‌ను ఎక్సైజ్ అధికారులు అరెస్ట్ చేసినప్పుడు అతని ఫోన్లో కొంత మంది సినీ రంగానికి చెందిన వారి ఫోన్ నెంబర్లు గుర్తించారు. వాట్సాప్ చాటింగ్ చేసినట్లు ఎక్సైజ్ అధికారుల దర్యాప్తులో తేలింది. దాని ఆధారంగానే ఎక్సైజ్ అధికారులు 12 మంది సినీరంగానికి చెందిన వారిని పిలిచి ప్రశ్నించారు. దీంతో ఈడీ అధికారులు మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications