తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఖరార్..?!
హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల (Telangana Assembly elections) వేడి పతాక స్థాయికి చేరుకుంటోంది. అక్టోబర్ 10వ తేదీ లోపే ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడం ఖాయంగా కనిపిస్తోంది. 7 లేదా 8వ తేదీల్లో షెడ్యూల్ విడుదల అవుతుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. సరిగ్గా నెల రోజుల తరువాత పోలింగ్ ఉండొచ్చనే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి.
వరుసగా మూడోసారి అధికారంలోకి రావడానికి అధికార భారత్ రాష్ట్ర సమితి (Bharat Rashtra Samithi) కసరత్తు పూర్తి చేస్తోంది. ఎన్నికల ప్రచార కార్యక్రమాలపై దృష్టి సారించింది. షెడ్యూల్ విడుదల కావడానికి ఎంతో సమయం లేకపోవడం వల్ల అభివృద్ధి ప్రాజెక్టుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలను ముమ్మరం చేసింది.

అటు కాంగ్రెస్ (Congress), భారతీయ జనతా పార్టీ (BJP) ఎన్నికల సమరానికి సన్నద్ధమౌతోన్నాయి. బీఆర్ఎస్ (BRS) నుంచి వలస వచ్చిన నాయకుల చేరికతో కాంగ్రెస్ పార్టీలో జోష్ పెరిగింది. ఇప్పటికే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy), జూపల్లి కృష్ణారావు (Jupalli Krishna Rao) కాంగ్రెస్ కండువా కప్పుకొన్నారు.
తాజాగా మైనంపల్లి హన్మంతరావు (Mynampalli Hanmantha Rao), వేముల వీరేశం (Vemula Veeresham) కాంగ్రెస్ తీర్థాన్ని పుచ్చుకున్నారు. బీజేపీతో పోల్చుకుంటే కాంగ్రెస్‌లో చేరికల జోరు భారీగా కనిపిస్తోంది. మరింత మంది నాయకులు కాంగ్రెస్‌లో చేరుతారంటూ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) ధీమా వ్యక్తం చేస్తోన్నారు.
ఈ పరిణామాల మధ్య- కేంద్ర ఎన్నికల కమిషన్ (ECI) తెలంగాణ (Telangana)లో పర్యటించబోతోంది. దీనికి సంబంధించిన షెడ్యూల్ కూడా ఖరారైంది. అక్టోబర్ 3, 4, 5 తేదీల్లో కీలక జిల్లాల్లో పర్యటించనుంది ఈసీ అధికారుల బృందం. అదే చివరి పర్యటన అవుతుందనే అభిప్రాయాలు ఉన్నాయి. ఈ పర్యటన తరువాత షెడ్యూల్ వెలువడుతుందని సమాచారం.

ఈసీ బృందం పర్యటనకు రానున్న నేపథ్యంలో- ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి (CS Shanti Kumari) సమీక్ష నిర్వహించారు. ఎన్నికల ప్రధానాధికారితో పాటు వివిధ శాఖల అధికారులు ఇందులో పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమీక్షా సమావేశానికి హాజరయ్యారు.
షెడ్యూల్ వెలువడినప్పటి నుంచి పోలింగ్ ప్రక్రియ పూర్తిగా ముగిసిపోయేంత వరకు నిర్వహించాల్సిన రోజువారీ కార్యాక్రమాలకు సంబంధించిన క్యాలెండర్‌ను ఈసీ ఇప్పటికే రూపొందించిన విషయం తెలిసిందే. తుది దశలో ఈవీఎంలు, వీవీప్యాట్, స్ట్రాంగ్ రూమ్‌లను తనిఖీ చేయడం, పోస్టల్ బ్యాలెట్ పత్రాల ముద్రణ, కౌంటింగ్ కేంద్రాల పరిశీలన వంటి కార్యక్రమాలపై శాంతికుమారి సమీక్ష చేపట్టారు.












Click it and Unblock the Notifications