జూబ్లీహిల్స్ ఎలక్షన్ పై ఈసీ కీలక అప్ డేట్..
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక మరికొన్ని రోజుల్లో జరగనుంది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని రాష్ట్రంలోని పార్టీలు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ ఎన్నికల్లో అభ్యర్థులను పోటీలో నిలబెట్టేందుకు ఇప్పటికే రాజకీయ పార్టీలు తీవ్రంగా కసరత్తు చేస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించాయి. ఆ పార్టీ నుంచి అభ్యర్థిగా మాగంటి సునీత గోపీనాథ్ పేరును బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇటీవల ప్రకటించారు. గత ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి గోపీనాథ్ విజయం సాధించిన విషయం తెలిసిందే.
మరోవైపు అధికార కాంగ్రెస్ పార్టీతోపాటు బీజేపీ తమతమ అభ్యర్థులను బరిలో నిలిపేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో గెలవబోతున్నామని ఇటీవల టీపీసీసీ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. ఉప ఎన్నికల్లో గెలిచేది తామేనన్నారు. నియోజకవర్గంలో సర్వేలు చేస్తున్నామని.. గెలిచే వారికే టికెట్ ఇస్తామన్నారు. సామాజిక వర్గం కాదని.. గెలిచే వారికే అవకాశం ఉంటుందని తెలిపారు. ఇక ఉప ఎన్నిక కోసం ఏ క్షణంలోనైనా నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదల అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో అన్ని పార్టీలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి.
అయితే తాజాగా జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నికను పర్యవేక్షించడానికి కేంద్ర పరిశీలకులను నియమించింది కేంద్ర ఎన్నికల సంఘం (ECI). ఈ మేరకు ఆదివారం దీనికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించింది. అలాగే బిహార్ లో అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా ఎనిమిది రాష్ట్రాల్లో ఉపఎన్నికల కోసం మొత్తం 470 మంది సీనియర్ అధికారులను నియమించినట్లు కమిషన్ తాజాగా ప్రకటన చేసింది. వీరిలో 320 మంది ఐఏఎస్, 60 మంది ఐపీఎస్, 90 మంది ఐఆర్ఎస్/ఐఆర్ఏఎస్/ఐసీఏఎస్ అధికారులు ఉన్నారు.

బిహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు తెలంగాణ (జూబ్లీహిల్స్), జమ్మూ & కాశ్మీర్ (బుడ్గామ్, హైరోటా), రాజస్థాన్ (అంట), మిజోరం (దంపా), ఒడిశా (నువాపాడ), ఝార్ఖండ్ (ఘట్సిలా), పంజాబ్ (టార్న్ తరణ్) అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరగనున్న ఉప ఎన్నికల కోసం పరిశీలకులను నియమించినట్లు వెల్లడించింది.












Click it and Unblock the Notifications