పొంగులేటి టార్గెట్ అయ్యారా?: ఢిల్లీ నుంచి దిగిన 16 టీమ్స్- మెరుపుదాడి: ఆ ప్రాజెక్ట్ కాంట్రాక్ట్?
Ponguleti Srinivas Reddy: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇబ్బందుల్లో పడ్డారు. తాజాగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులకు ఆయన టార్గెట్ అయ్యారు. హైదరాబాద్‌లో గల ఆయన నివాసాలు, కార్యాలయాలపై ఏకకాలంలో దాడులకు దిగారు.
ఈడీ అధికారులు, ఇతర సిబ్బందితో కూడిన మొత్తం 16 బృందాలు ఈ ఉదయం నుంచి పొంగులేటి నివాసాలు, కార్యాలయాలపై దాడులు కొనసాగిస్తోన్నాయి. ఏకకాలంలో తనిఖీలకు దిగాయి. ఈ సందర్భంగా కొన్ని కీలక డాక్యుమెంట్లను వాళ్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.

పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుటుంబానికి చెందిన రాఘవ కన్‌స్ట్రక్షన్స్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, ఇతర డైరెక్టర్ల నివాసాలు, కార్యాలయాల్లోనూ ఈ తనిఖీలు విస్తృతంగా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఖమ్మంలో గల ఆయన ఇంటిపైనా కూడా దాడులు సాగిస్తోన్నట్లు సమాచారం.
కాగా- ఈ దాడుల్లో హైదరాబాద్ రీజియన్ ఈడీ కార్యాలయానికి చెందిన అధికారులు ఎవ్వరూ పాల్గొనలేదని చెబుతున్నారు. 16 టీమ్‌ల అధికారులు, సిబ్బంది మొత్తం కూడా ఢిల్లీ నుంచే దిగారని, అక్కడి జోనల్ కార్యాలయ అధికారులే ఇందులో పాల్గొన్నారని అంటున్నారు.
నారాయణ్‌పేట్- కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ పనులను ఈ రాఘవ కన్‌స్ట్రక్షన్స్ సంస్థ దక్కించుకుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ ప్రచారం మొదలైన తరువాతే ఈడీ రంగంలోకి దిగిందనే వాదనలూ లేకపోలేదు. గతంలో కూడా పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఈడీ దాడులను ఎదుర్కొన్నారు.
మరోవంక- ఈ దాడుల పట్ల కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం ఈ సోదాలు సాగుతున్నాయని మండిపడింది. ఐటీ, సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు ఏజెన్సీలను తన రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీ వాడుకుంటోందంటూ ఆరోపిస్తోంది.












Click it and Unblock the Notifications