TSPSC పేపర్ లీకేజీ కేసులో ఈడీ దూకుడు: నాంపల్లి కోర్టులో పిటిషన్
హైదరాబాద్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC)పేపర్ లీక్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించిన డాక్యుమెంట్లను తమకు ఇవ్వాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED) నాంపల్లి కోర్టులో పిటిషన్ వేసింది. ఇందుకు సంబంధించి మార్చి 23న సీసీఎస్ ఏసీపీకి లేఖ రాసినట్లు ఈడీ తెలిపింది.
టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో మీడియా కథనాలు, పబ్లిక్ డొమైన్లో ఉన్న సమాచారం, ఇంటెలిజెన్స్ ద్వారా వచ్చిన ప్రాథమిక వివరాల కేంద్రంగా ఈడీ ఈసీఐఆర్‌ను నమోదు చేసింది. ఇందులో భాగంగానే పీఎంఎల్ఏ సెక్షన్ 50 కింద ప్రవీణ్, రాజశేఖర్ స్టేట్‌మెంట్లు రికార్డు చేయనున్నట్లు ఈడీ కోర్టుకు తెలిపింది. చంచల్‌గూడ జైలులో ఉన్న నిందితులు ప్రవీణ్, రాజశేఖర్ లను నలుగురు అధికారులతో కూడిన బృందం విచారిస్తుందని ఈడీ కోర్టుకు వెల్లడించింది.

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీలో మనీ లాండరింగ్ జరిగినట్లు ఈడీ అభియోగం మోపిందని ఈడీ తరపు న్యాయవాది తెలిపారు. దీనిలో భాగంగా సెక్షన్ 48, 49 కింద ఈడీకి విచారించే అర్హత ఉందని పేర్కొన్నారు. విచారణలో భాగంగా జైలులో విచారణ సందర్భంగా ల్యాప్‌టాప్, ప్రింటర్, ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించాలని కోరుతూ ఈడీ పిటిషన్ దాఖలు చేసింది.
ఇద్దరు నిందితులు ప్రవీణ్, రాజశేఖర్ లను విచారిస్తున్నప్పుడు చంచల్‌గూడ జైలులో తగిన ఏర్పాట్లు చేసే విధంగా జైలు సూపరింటెండెంట్‌కు ఆదేశాలు ఇవ్వాలని నాంపల్లి కోర్టును కోరింది ఈడీ. ఇది ఇలావుండగా, మంగళవారం సిట్ అధికారులు ఈ కేసులో దర్యాప్తు చేసిన విచారణ నివేదికను హైకోర్టులో సమర్పించారు.
కాగా, ప్రధాన సాక్షిగా పేర్కొన్న కాన్ఫిడెన్షియల్ సెక్షన్ అధికారిణి శంకరలక్ష్మిపై ఈడీ అధికారులు ప్రధానంగా దృష్టి సారించారు. అయితే, ఆమెను మరోసారి విచారించే యోచనలో ఈడీ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో శంకరలక్ష్మి, నారాయణకు బుధ, గురువారాల్లో విచారణకు రావాలని ఆదేశించింది. వీరి వద్ద నుంచి ఈడీ కీలక సమాచారం రాబట్టే అవకాశం ఉంది. అనంతరం ప్రధాన నిందితులను విచారించి, డబ్బులు ఎలా చేతులు మారాయనేదానిపై తేల్చనుంది.












Click it and Unblock the Notifications