తెలంగాణ విద్యా వ్యవస్థలో చారిత్రక సంస్కరణలు.. ఆ తరగతులకు సెమిస్టర్ విధానం?
తెలంగాణ రాష్ట్రంలో విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులకు తెలంగాణా సర్కార్ శ్రీకారం చుట్టింది. తెలంగాణ విద్యా విధాన కమిటీ ప్రస్తుత వార్షిక విద్యా విధానానికి బదులు 9వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు సెమిస్టర్ సిస్టమ్ ను ప్రవేశపెట్టాలని తీవ్రంగా ఆలోచిస్తోంది. ఈ మార్పు విద్యార్థులపై పడే మానసిక ఒత్తిడిని గణనీయంగా తగ్గించి, విద్యా సంవత్సరం మొదటి రోజు నుంచే చదువుపై శ్రద్ధ చూపేలా చేస్తుందని భావిస్తోంది.
స్కూల్ స్థాయిలోనూ సెమిస్టర్ విధానం
ఉన్నత విద్యా స్థాయిల్లో ఇప్పటికే అమలులో ఉన్న సెమిస్టర్ విధానాన్ని పాఠశాల స్థాయికి కూడా విస్తరించాలని కమిటీ సభ్యులు భావిస్తున్నారు. ప్రస్తుత వార్షిక విధానంలో విద్యార్థులు ఏడాది పొడవునా సిలబస్ మొత్తాన్ని ఒకేసారి గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. మార్చి-ఏప్రిల్ నెలల్లో భారీగా పునశ్చరణ చేయడం వల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఇందుకు భిన్నంగా సెమిస్టర్ విధానంలో సిలబస్‌ను రెండు భాగాలుగా విభజించి, సంవత్సరంలో రెండు సార్లు పరీక్షలు నిర్వహిస్తారు.

బట్టీ చదువులకు చెక్ పెట్టడం లక్ష్యంగా
దీంతో విద్యార్థులు నెమ్మదిగా, స్థిరంగా చదువుకోవడానికి అవకాశం లభిస్తుంది. మొదటి సెమిస్టర్ ఫలితాల ఆధారంగా ఉపాధ్యాయులు విద్యార్థుల బలహీనతలను గుర్తించి, రెండో సెమిస్టర్‌లో ప్రత్యేక శ్రద్ధ చూపవచ్చు. బట్టీ చదువులకు చెక్ పెట్టడం అనే కీలక అంశం కూడా ఇందులో ఉంది. కేవలం థియరీ పాఠాలకు పరిమితం కాకుండా, ప్రాక్టికల్స్‌కు, అనుభవపూర్వక అభ్యసనానికి ప్రాధాన్యత ఇవ్వాలని కమిటీ నిర్ణయించింది.
నర్సరీ నుంచి ఇంటర్ వరకు చదువుకునే అవకాశం
పాఠశాలల్లో ల్యాబ్‌లను ఆధునీకరించి, విద్యార్థులు తాము చదువుతున్న విషయాలను ప్రయోగాత్మకంగా అర్థం చేసుకునేలా చేయనున్నారు. ఇలా అనుభవం ద్వారా నేర్చుకోవడం వల్ల జ్ఞానం శాశ్వతంగా మెదడులో నిలిచిపోతుందని విద్యావేత్తలు చెబుతున్నారు.అంతేకాకుండా, పాఠశాల విద్యలో ఇంటర్మీడియట్‌ను విలీనం చేసే అవకాశాన్ని కూడా కమిటీ పరిశీలిస్తోంది. ఒకే క్యాంపస్‌లో నర్సరీ నుంచి ఇంటర్ వరకు చదువుకునే అవకాశం ఏర్పడితే విద్యార్థులకు ఎంతో సౌకర్యం కలుగుతుంది.
టీచర్లు కూడా ప్రణాళికాబద్ధంగా సిలబస్ పూర్తి
సాంకేతిక ఇబ్బందులు ఉంటే ముందుగా ఇంటర్ స్థాయిలోనే సెమిస్టర్ విధానం అమలు చేయాలని ఆలోచన ఉంది. ఇంటర్ బోర్డు అధికారులు కూడా ఈ ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఈ మార్పులు అమలైతే టీచర్లు కూడా ప్రణాళికాబద్ధంగా సిలబస్ పూర్తి చేయగలుగుతారు. హడావుడి లేకుండా నాణ్యమైన బోధనకు అవకాశం ఏర్పడుతుంది. ల్యాబ్‌ల నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పనపై కమిటీ ప్రత్యేక నివేదిక సిద్ధం చేస్తోంది.
నివేదికపై అధికారిక నిర్ణయం తీసుకోనున్న తెలంగాణా సర్కార్
జాతీయ, అంతర్జాతీయ పోటీ పరీక్షలకు తెలంగాణ విద్యార్థులను సమర్థవంతంగా సిద్ధం చేయడమే ఈ సంస్కరణల ముఖ్య ఉద్దేశం. ఈ ప్రతిపాదనలు అమలు చేస్తే తెలంగాణ విద్యా వ్యవస్థ దేశంలోనే ఆదర్శవంతమైన నమూనాగా మారుతుందని విద్యావేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల సమగ్ర అభివృద్ధి, నైపుణ్యాల పెంపు, మానసిక ఆరోగ్యం కాపాడడం వంటి అనేక లక్ష్యాలను ఈ సంస్కరణలు సాధించగలవు. ప్రభుత్వం త్వరలో ఈ నివేదికపై అధికారిక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.













Click it and Unblock the Notifications