సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలపై కోర్టు తీర్పు: ఉద్యోగుల కుటుంబాలకు కొత్త సమస్యలు

Posted By:
Subscribe to Oneindia Telugu

గోదావరిఖని:సింగరేణిలో పనిచేసే కార్మికులు, ఉద్యోగుల పిల్లలకు వారసత్వ ఉద్యోగాలు ఇవ్వకూడదంటూ రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో ఆ ప్రభావం సింగరేణి కార్మికుల కుటంబాల్లో తీవ్రంగా కన్పిస్తోంది.వారసత్వ ఉద్యోగాలపై సుప్రీంకోర్టులో సవాల్ చేసేందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం సన్నద్దమైంది.

సింగరేణిలో పనిచేసే ఉద్యోగులు, కార్మికుల పిల్లలకు వారసత్వ ఉద్యోగాలను కల్పించేందుకుగాను వీలుగా రాష్ట్ర ప్రభుత్వం జివోను జారీ చేసింది. ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వారసత్వ ఉద్యోగాలను రద్దుచేస్తూ నిర్ణయం తీసుకొన్నారు.

అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయమై సమీక్ష నిర్వహించి వారసత్వ ఉద్యోగాలను ఇవ్వాలని నిర్ణయం తీసుకొంది. ఈ మేరకు కొన్ని నిబంధనలను కూడ జారీ చేసింది.

అయితే వారసత్వ ఉద్యోగాలు వస్తాయని ఆశలు వచ్చిన నేపథ్యంలో సింగరేణి విస్తరించిన ప్రాంతాల్లో పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి.అయితే వారసత్వ ఉద్యోగాలపై కొందరు హైకోర్టును ఆశ్రయించారు.దీంతో వారసత్వ ఉద్యోగాలు ఇవ్వడాన్ని రద్దు చేస్తూ కోర్టు ఆదేశాలను జారీ చేసింది.

వారసత్వ ఉద్యోగాల రద్దు పెళ్ళిళ్ళపై ప్రభావం

వారసత్వ ఉద్యోగాల రద్దు పెళ్ళిళ్ళపై ప్రభావం

సింగరేణిలో పనిచేసే ఉద్యోగులు తమ సర్వీసుకు ముందుగానే తమ కుటుంబంలోని వారికి ఉద్యోగం కల్పించే విషయమై సింగరేణికి ధరఖాస్దు చేసుకోవాల్సి ఉంటుంది. కొడుకులు ఉంటే ఎవరైతే ఈ ఉద్యోగానికి ధరఖాస్తు చేస్తారో వారి పేర్లను సూచించాలి. కొడుకులు లేకుండా కూతుళ్ళే ఉంటే వారికి వివాహం జరిగితే అల్లుడికి ఈ ఉద్యోగం ఇచ్చేలా మార్గదర్శకాలను రూపొందించారు.ఇటీవల బెల్లంపల్లిలో ఓ వ్యక్తి తన కూతురికి వివాహం జరిపించాడు.వివాహం జరిగిన మరుసటి రోజునే వారసత్వ ఉద్యోగాలకు హైకోర్టు బ్రేక్ వేస్తూ నిర్ణయాన్ని ప్రకటించింది.దీంతో కట్న కానుకాలు లేకుండానే పెళ్ళికి సిద్దమైన వరుడి తరుపు కుటుంబసభ్యులు కట్నకానుకలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.వారసత్వ ఉద్యోగాలకు పెళ్ళిఫోటోలు, వీడియోలను ధరఖాస్తుతో పాటు సమర్పించాల్సి ఉంది. అయితే ఈ సమయంలోనే వారసత్వ ఉద్యోగాలపై కోర్టు ఇచ్చిన తీర్పు నిరుద్యోగులకు ఆశనిపాతంలా మారింది.

కట్నకానుకలకు బదులుగా ఉద్యోగం

కట్నకానుకలకు బదులుగా ఉద్యోగం

సింగరేణిలో ఉద్యోగం ఇప్పిస్తే పెళ్ళి సమయంలో అమ్మాయి తరపు వాళ్ళు కట్న కానుకాలు ఇవ్వాల్సిన అవసరం లేదనే పద్దతులు వచ్చాయి. ఇదే పద్దతితో అనేకమంది పెళ్ళిళ్ళ ఒప్పందాలు కూడ చేసుకొన్నారు. ఈ మేరకు కొన్ని వివాహలు కూడ జరిగాయి.అయితే కోర్టు తీర్పు నేపథ్యంలో వివాహలు జరిగిన కుటుంబాల్లో ఇబ్బందులు చోటుచేసుకొనే పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవేళ ఉద్యోగం రాకపోతే కట్నకానుకలు, ఇతర ఆస్తుల వ్యవహరంపై గొడవలు చోటుచేసుకొనే అవకాశాలు కన్పిస్తున్నాయి.

ప్రైవేట్ ఉద్యోగాలు మానుకొని సింగరేణిలో ఉద్యోగం కోసం

ప్రైవేట్ ఉద్యోగాలు మానుకొని సింగరేణిలో ఉద్యోగం కోసం

సింగరేణిలో ఉద్యోగం చేయడం అంత ఆషామాషీ కాదు. ఇక్కడ పనిచేసేవారికి వేలల్లో వేతనాలు వస్తాయి.కాని అంతే కష్టం చేయాల్సి ఉంటుంది. క్షేత్రస్థాయిలో పనిచేసేవారు మరింత కష్టపడతారు. హైద్రాబాద్, చెన్నై, బెంగుళూరు లాంటి ప్రాంతాల్లో ప్రైవేట్ ఉద్యోగాలు చేసేవారు సింగరేణి ప్రాంతాల్లో ఉద్యోగాల కోసం స్వస్థలాలకు చేరుకొన్నారు. త్వరలోనే ఉద్యోగం వస్తోందనే ఆశతో ప్రయత్నాలను ప్రారంభించారు. కాని, హైకోర్టు వారి ఆశలపై నీళ్ళు చల్లింది.

కుటుంబాలపై వారసత్వ ఉద్యోగాల ప్రభావం

కుటుంబాలపై వారసత్వ ఉద్యోగాల ప్రభావం

సింగరేణిలో వారసత్వ ఉద్యోగాల కోసం పోటీ నెలకొంది. ఒకే కుటుంబంలో ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువమంది కొడుకులు ఉంటే ఉద్యోగం కోసం పోటీలు నెలకొన్నాయి. కొన్ని సందర్భాల్లో ఈ గొడవలు ఆ కుటుంబాల్లో గొడవలకు కారణమయ్యాయి. కూతుళ్ళకు పెళ్ళి చేసి అల్లుళ్ళకు ఉద్యోగం ఇవ్వాలని భావించినవారికి కోర్టు తీర్పు ప్రతిబంధకంగా మారింది.ఈ విషయమై సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళాలని భావిస్తోంది. అయితే దీనిపై స్పష్టత వచ్చేవరకు గందరగోళం మాత్రం తప్పేలా కన్పించడం లేదు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The high court order on compassionate employment in sccl effects on singareni employees families.
Please Wait while comments are loading...