సీఎం కేసీఆర్ కు ఎన్నికల సంఘం అడ్వైజరీ..!!
ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎన్నికల సంఘం అడ్వైజరీ జారీ చేసింది. దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్ది కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తితో జరిగిన దాడి ఘటనపై స్పందిస్తూ ఆ పార్టీ అధినేత..సీఎం కేసీఆర్ చేసిన ప్రసంగం పై కేంద్రం ఎన్నికల సంఘం సీరియస్ అయింది. వైషమ్యాలు పెంపొందించే విధంగా ముఖ్యమంత్రి ప్రసంగం ఉందని..ఇది ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘననే అని స్పష్టం చేసింది. ఇకపై అలాంటి రెచ్చగొట్టే ప్రసంగాలు చేయరాదని హితవు పలికింది.
ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్యకార్యదర్శి అవినాష్ కుమార్ ముఖ్యమంత్రి కేసీఆర్ కు అడ్వైజరీ జారీ చేసారు. కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన దాడిపై స్పందిస్తూ గత నెల 30న నిజామాబాద్ జిల్లా బాన్స్ వాడ లో చేసిన ఎన్నికల ప్రసంగంలో రెచ్చగొట్టేలా ప్రసంగించారంటూ యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసారు. దీని పైన ఈసీ విచారణకు ఆదేశించింది. స్థానిక రిటర్నింగ్ అధికారి విచారణ చేసి ఈ నెల 14న కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక పంపారు.

బాధ్యతాయుతమైన పదవి..స్టార్ క్యాంపెయినర్ గా ఉండి అనుచిత వ్యాఖ్యలు చేయటం సరికాదని పేర్కొంది. రెచ్చగొట్టే ప్రసంగాలు చేయవద్దని సూచించింది. ఇలాంటి ప్రసంగాలు చేస్తే తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించింది. ఇలాంటి ప్రసంగాలు నిబంధలనకు వ్యతిరేకమని పేర్కొన్న ఎన్నికల సంఘం..ఇలాంటి సందర్భాల్లో తగిన చర్యలు తీసుకొనే అధికారం ఈసీకి ఉంటుందని స్పష్టం చేసింది. దీంతో, ఇక పై రెచ్చగొట్టే ప్రసంగాలు చేయవద్దంటూ కేసీఆర్ ఈసీ ఎడ్వైజరీ జారీ చేసింది. ఇక, ఈ నెల 28తో తెలంగాణ ఎన్నికల ప్రచారం ముగియనుంది.
బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మూడు పార్టీల అగ్ర నేతలు ఈ మూడు రోజులు సుడిగాలి ప్రచారానికి సిద్దమయ్యారు. హోరా హోరీగా సాగుతున్న ఎన్నికల ప్రచారంలో గెలుపు ఎవరిదనే అంచనాలు పెరుగుతున్నాయి. ప్రధానంగా కాంగ్రెస్ వర్సస్ బీఆర్ఎస్ అన్నట్లుగా ఎన్నికల పోరు కనిపిస్తోంది. దీంతో, చివరి నిమిషంలో ఓటర్లను తమకు అనుకూలంగా మలచుకొనేందుకు పార్టీలు చివరి ప్రయత్నాలు ప్రారంభించాయి. ఈ నెల 30న ఎన్నికల పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3న ఫలితాలు వెల్లడికానున్నాయి.












Click it and Unblock the Notifications