ఎర్రబెల్లి సంచలనం: ఎన్టీఆర్‌ను బాబు గద్దె దించిన తీరుతో పోలిస్తే మేం చేసిందెంత?
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ నుంచి టీఆర్ఎస్‌లో చేరిన సీనియర్ రాజకీయ నాయుకుడు ఎర్రబెల్లి దయాకరరావుటీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే.
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యేందుకు వచ్చిన ఆయన శనివారం అసెంబ్లీ లాబీల్లో మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడుతూ టీడీపీ పార్టీ శాసనసభ పక్షాన్నే టీఆర్ఎస్ లో విలీనం చేశాం కానీ ఫిరాయింపు కాదని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీలో టీఆర్ఎస్ అనుబంధ సభ్యుడిగా కొనసాగుతున్నానని ఎర్రబెల్లి చెప్పారు.

తాను దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌కు వీరాభిమానినని చెప్పుకొచ్చారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల విలీనంపై గతంలో ఎన్టీఆర్‌ను పక్కకు తప్పించినప్పుడు చంద్రబాబు ఏంచేశారో ఇప్పుడు తాము అదే చేశామని ఎర్రబెల్లి చెప్పారు. ఎన్టీఆర్‌ను గద్దె దించి బాబు సీఎం అయిన తీరుతో పోలిస్తే మేం చేసింది ఎంత? అని మీడియాని ఎదురు ప్రశ్నించారు.
ఆ రోజు చంద్రబాబును కాదన్న ఎమ్మెల్యేలను గుర్తించినట్టే ఇప్పుడు అదే పద్ధతిలో గుర్తించారని తెలిపారు. టీఆర్ఎస్‌లోకి వస్తానంటూ తాను ఏ ఒక్క నేతకు కూడా ఫోన్ చేయలేదని ఆయన పేర్కొన్నారు. మంత్రి పదవి ఇస్తే తీసుకుంటా, కానీ అడగను అని స్పష్టం చేశారు. పార్టీ విలీనంపై స్పీకర్‌నే అడగాలని, తెలంగాణలో కేసీఆర్ తర్వాత అంతటి గుర్తింపు తనకే ఉందన్నారు.
తాను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కూడా వరుసగా గెలుస్తూ వస్తున్నానని ఎర్రబెల్లి మీడియాతో చెప్పారు. పాలకుర్తి నియోజకవర్గంలోని టీడీపీ కార్యకర్తలంతా తన వెంటే ఉన్నారని ఆయన స్పష్టం చేశారు. గతంలో టీఆర్‌ఎస్‌లో చేరేందుకు తనతో ఉన్న 50 శాతం మంది అంగీకరించలేదని తెలిపారు. ఇప్పుడు టీఆర్‌ఎస్‌లో చేరడాన్ని అందరూ స్వాగతిస్తున్నారని చెప్పారు.












Click it and Unblock the Notifications