టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్: వారంతా రాజీనామా చేయాలన్న ఈటల, బండి సంజయ్ ఇలా
టీఎస్‌పీఎస్సీ(TSPSC)లో పేపర్ లీకేజీ వ్యవహారంపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తీవ్రంగా స్పందించారు.
హైదరాబాద్: టీఎస్‌పీఎస్సీ(TSPSC)లో పేపర్ లీకేజీ వ్యవహారంపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తీవ్రంగా స్పందించారు. తెలంగాణలో నాలుగు పరీక్షల ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయంటే బీఆర్ఎస్ ప్రభుత్వం పనితనం ఏ విధంగా ఉందో అర్థమవుతోందని విమర్శించారు. ఇది కావాలని చేశారా? యాదృచ్ఛికంగా జరిగిందా? అనే విషయాన్ని సీఎం కేసీఆర్ స్పష్టం చేయాలన్నారు.

సీఎం కేసీఆర్, టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ రాజీనామా చేయాలన్న ఈటల
టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్, కమిటీ సభ్యులు మూకుమ్మడిగా రాజీనామా చేయాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. పేపర్ లీకేజీపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించడం లేదని.. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని ఈటల డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో సిట్టింగ్ జడ్జీతో విచారణ జరిపించి.. బాధ్యులను కఠినంగా శిక్షించాలని కోరారు. రద్దయిన పరీక్షలను వెంటనే నిర్వహించాలన్నారు.

వారికి ఆర్థిక సాయం చేయాలంటూ ఈటల రాజేందర్
ఏళ్ల తరబడి నిరుద్యోగులు కష్టపడి అప్పులు చేసి చదువుకున్నారని ఈటల రాజేందర్ ఆందోళన వ్యక్తం చేశారు. మళ్లీ వారు చదువుకోవడానికి ప్రభుత్వం ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలన్నారు. యువత తొందరపడి ఆత్మహత్యలకు పాల్పడవద్దని సూచించారు. ఇది ఇలావుండగా, శనివారం టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీపై రాష్ట్ర బీజేపీ నేతలు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ను కలిసి ఫిర్యాదు చేశారు. పేపర్ లీకేజీపై బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని గవర్నర్‌కు వివరించారు. గవర్నర్ ను కలిసిన వారిలో బూర నర్సయ్య గౌడ్, ఈటల రాజేందర్, డీకే అరుణ, మర్రి శశిధర్ రెడ్డి, రామచంద్రరావు, విఠల్ తదితరులు ఉన్నారు.
సిట్టింగ్ జడ్జీతో విచారణ జరపాలన్న బండి సంజయ్
మరోవైపు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారంపై మండిపడ్డారు. పేపర్ లీక్ కేసులో తప్పు జరగనప్పుడు సిట్టింగ్ జడ్జితో విచారణ జరపడానికి అభ్యంతరమేంటని బండి సంజయ్ ప్రశ్నించారు. పేపర్ లీక్ ఘటనతో 30 లక్షల మంది విద్యార్థుల జీవితాలను నాశనం చేశారని ధ్వజమెత్తారు. అభ్యర్థులంతా రోడ్కెక్కి ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం కనీసం భరోసా ఇచ్చే ప్రయత్నం చేయడం లేదన్నారు.

రేణుక ఫ్యామిలీ అధికార పార్టీలోనే ఉందన్న బండి సంజయ్
నిరుద్యోగుల సమస్యల్ని పట్టించుకోకుండా లిక్కర్ కేసులో కవితను కాపాడుకోవడానికి మంత్రులంతా ఢిల్లీలో మకాం వేశారని అన్నారు. పేపర్ లీక్ కేసులో అరెస్ట్ అయిన రేణుక ఫ్యామిలీ బీఆర్ఎస్ లో ఉందని బండి సంజయ్ ఆరోపించారు. ఇన్నేళ్లు టీఎస్‌పీఎస్సీలో పని చేస్తున్నా వాళ్లను ఎందుకు గుర్తించలేదని ప్రశ్నించారు. పక్క రాష్ట్రాలను వదిలేసి ముందు సొంత రాష్ట్రంలో ఏం జరుగుతుందో సరిదిద్దుకోవాలని కేటీఆర్‌కు సూచించారు. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పారని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications