పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు బీజేపీలో చేరతారా?: ఈటల రాజేందర్ షాకింగ్ కామెంట్స్
హైదరాబాద్: భారత్ రాష్ట్ర సమితి(BRS) బహిష్కృత నేతలు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు బీజేపీలో చేరికపై హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. వారిద్దరూ బీజేపీలో చేరడం కష్టమే అని తన అభిప్రాయం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు.
'ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ బలంగా ఉంది. బీజేపీ బలంగా లేదు. పొంగులేటి, జూపల్లితో నేను రోజూ మాట్లాడుతున్నాను. వారే నాకు రిడర్స్ కౌన్సెలింగ్ ఇస్తున్నారు. ఇప్పటి వరకు వారిద్దరూ కాంగ్రెస్‌లో చేరకుండా మాత్రమే నేను ఆపగలిగాను. బీజేపీలో చేరేందుకు వారికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి' అని ఈటల రాజేందర్ తెలిపారు.

అంతేగాక, 'ఇప్పటికీ కమ్యూనిస్ట్ ఐడియాలజీ ఉన్న జిల్లా ఖమ్మం. దేశానికి కమ్యూనిస్టు సిద్ధాంతం నేర్పిన గడ్డ తెలంగాణ. ఖమ్మంలో వామపక్షాలు, టీడీపీ సహా అన్ని పార్టీలుంటాయి. ప్రియాంక గాంధీని అప్పట్లో పొంగులేటి కలిశారని తెలిసింది. అంతకంటే ముందే ఖమ్మం వెళ్లి పొంగులేటితో చర్చించాను' అని ఈటల రాజేందర్ వెల్లడించారు.
కాగా, బీఆర్ఎస్ పార్టీకి దూరమైన తర్వాత పొంగులేటి శ్రీనివాస్, జూపల్లి కృష్ణారావు ఏ పార్టీలో చేరతారనేది ఆసక్తికరంగా మారిన విషయం తెలిసిందే. కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడతామంటున్న ఈ ఇద్దరు నేతలు ఏ పార్టీలోనూ చేరతామని స్పష్టం చేయడం లేదు. దీంతో కాంగ్రెస్, బీజేపీ, వైయస్సార్ తెలంగాణ పార్టీలు ఈ ఇద్దరు నేతలతో సంప్రదింపులు జరుపుతున్నాయి. అయితే, తాజాగా, ఈటల రాజేందర్ వ్యాఖ్యలతో ఈ ఇద్దరు నేతలు బీజేపీలో చేరేందుకు సుముఖంగా లేరనే విషయం తెలుస్తోంది.
కాంగ్రెస్ పార్టీ నేతలు సంప్రదించిన సమయంలో పొంగులేటి పలు డిమాండ్లను వారి ముందుంచినట్లు తెలుస్తోంది. అయితే, ఆ డిమాండ్లన్నింటికీ కాంగ్రెస్ పార్టీ అంగీకరించలేదని, కొన్నింటికి మాత్రమే ఓకే చెప్పిందని తెలిసింది. దీంతో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరికపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. గతంలో వైయస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలతోనూ పొంగులేటి శ్రీనివాస్ భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వీరు ఏ పార్టీలో చేరుతారనేదానిపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది.












Click it and Unblock the Notifications