KCR మీద ఈటెల రాజేందర్ పోటీచేయడం వెనక..??
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం గజ్వేల్. 2014, 2019 ఎన్నికల్లో వరుసగా ఘనవిజయం సాధించిన కేసీఆర్ ఈ నియోజకవర్గాన్ని పూర్తిగా అభివృద్ధి చేశారు. కేసీఆర్ అక్కడ పర్యటించినా, పర్యటించకపోయినా ఆయన తరఫున పనిచేయడానికి ప్రత్యేకంగా అధికారుల బృందం ఉంది. ఆయనకు గజ్వేల్ లో ప్రధాన ప్రత్యర్థి వంటేరు ప్రతాప్ రెడ్డి. ఆయన ఒకసారి తెలుగుదేశం పార్టీ తరఫున, ఒకసారి కాంగ్రెస్ పార్టీ తరఫున కేసీఆర్ ను ఢీకొట్టారు.

టీఆర్ఎస్ లో చేరిన వంటేరు
రెండుసార్లు ఓటమి పాలైనప్పటికీ ముఖ్యమంత్రి అభ్యర్థికి గట్టి పోటీ ఇవ్వగలిగారు అనే పేరు తెచ్చుకున్నారు వంటేరు. కేసీఆర్ చాకచక్యంగా వ్యవహరించి తనకు తలనొప్పిగా ఉన్న ప్రతాప్ రెడ్డిని టీఆర్ఎస్‌లో చేర్చుకొని నామినేటెడ్ పదవి కట్టబెట్టారు. కేసీఆర్ తరఫున నియోజకవర్గమంతా పనులన్నీ ఆయనే దగ్గరుండి చక్కబెడుతున్నారు. గ్రామ గ్రామానికి, మండలానికి అన్నిచోట్ల నాయకులు, కార్యకర్తలతో పార్టీ పటిష్టంగా ఉంది. వంటేరు అయినా ఒకటే.. కేసీఆర్ అయినా ఒకటే అనే రీతిలో నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్ర సమితి వేళ్లూనుకుపోయింది.

పశ్చిమబెంగాల్ ను పునరావృతం చేస్తానంటున్న ఈటెల
అటువంటి నియోజకవర్గానికి వెళ్లి తాను కేసీఆర్ మీద పోటీచేస్తానని, తెలంగాణ ఎన్నికలు మరోసారి పశ్చిమబెంగాల్ ఎన్నికలను పునరావృతం చేస్తాయంటూ బీజేపీ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ప్రకటించారు. ఆయన 2004 నుంచి వరుసగా హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి గెలుస్తూ వస్తున్నారు. ఇప్పుడు గజ్వేల్ వెళ్లి మమతాబెనర్జీ మీద సుబేందు అధికారి గెలుపొందినట్లు గెలవాలనే వ్యూహం బీజేపీ కేంద్ర పెద్దలు అల్లారు. దాన్ని ఇక్కడ అమలు చేసే బాధ్యత ఈటెలకు అప్పగించినట్లు తెలుస్తోంది.

తెలంగాణకు, బెంగాల్ కు చాలా తేడా ఉంది
పశ్చిమబెంగాల్ ఎన్నికలకు, తెలంగాణ ఎన్నికలకు, అక్కడి ఓటర్ల మనస్తత్వాలకు, ఇక్కడి ఓటర్ల మనస్తత్వాలకు చాలా తేడా ఉంది. తెలంగాణ మనది అంటూ ఇక్కడి ప్రజల మనసుల్లో నాటుకుపోయింది. తెలంగాణ ఉద్యమాన్ని పునాదిగా చేసుకొని ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితిని ఇక్కడి ప్రజలు తమ సొంతపార్టీ గా భావిస్తారు. ఒకరకంగా స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధుల వల్ల వ్యతిరేకత వ్యక్తమైనప్పటికీ ఎన్నికల సమయానికి వచ్చేసరికి మనసంతా గులాబీరంగుపై మళ్లుతుంది. ఓటు వెళ్లి కారు గుర్తుపై పడుతుంది. ఒకరకంగా వారి భావోద్వేగాలతో టీఆర్ ఎస్ ముడిపడిపోయివుంది. అంతగా పార్టీని కేసీఆర్ పార్టీని ప్రజలతో మమేకం చేయగలిగారు. ఈ కారణమే రాష్ట్రాన్ని ఇచ్చినప్పటికీ రెండుసార్లు కాంగ్రెస్ పార్టీ ఓటమిపాలుచేసింది. ఉప ఎన్నికల్లో గెలవడం వేరు.. సాధారణ ఎన్నికల్లో గెలుపొందం వేరు అనే విషయాన్ని ఈటెల తెలుసుకోగలిగితే చాలు అంటున్నారు.. రాజకీయ విశ్లేషకులు












Click it and Unblock the Notifications